
ఎన్టీఆర్ జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి
ప్రొద్దుటూరు కల్చరల్ : ముఖ్యమంత్రి చంద్రబాబు అంత దుర్మార్గుడు ఎవరూ లేరని ఎన్టీఆర్ సతీమణి, వైఎస్సార్‌సీపీ మహిళా నాయకురాలు లక్ష్మీపార్వతి పేర్కొన్నారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు నాటక కళాపరిషత్ 27వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొన్నారు. ఆమె రచించిన నందమూరి తారకరామారావు జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థానాలకు ఎదిగారని, ఆయన వ్యక్తిత్వం గొప్పదని చెప్పారు. 1949లో మన దేశం సినిమాతో సినీ రంగానికి ఆయన పరిచయమై తెలుగువారి గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటిచెప్పారన్నారు. 35 ఏళ్లు సినీ ఫీల్డ్‌లో ఉన్నారని తెలిపారు. తెలుగు ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారం చేపట్టి ముఖ్యమంత్రి అయ్యారన్నారు. గొప్ప రాజకీయ వేత్త అని, ఆయన పేరు రెండు సార్లు గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కిందని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ తనను పెళ్లి చేసుకున్నాక ఎన్నో అవమానాలను భరించాల్సి వచ్చిందన్నారు. స్వార్థ రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాయుడు ఎన్నో అభూత కల్పనలు చేశారన్నారు. చంద్రబాబు ఎన్టీఆర్ చరిత్రను వక్రీకరించారన్నారు. వాస్తవాలను తెలుసుకోవాలంటే తాను రచించిన ఎన్టీఆర్ జీవిత చరిత్ర చదవాలన్నారు. ఎన్టీఆర్ చివరి ఇంటర్వ్యూలో తన గురించి, చంద్రబాబు గురించి ఏమి మాట్లాడారో తెలుసుకుంటే చంద్రబాబు నిజస్వరూపం తెలుస్తుందన్నారు. ఎన్టీఆర్‌కు జరిగిన అన్యాయాన్ని, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జరిగిన అన్యాయాన్ని అందరికి చెప్పాలనే ఉద్దేశంతో తాను వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. చంద్రబాబు పాలనలో అవినీతి, అక్రమాలు, భూ, ఇసుక దందాలు పెరిగి అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయని అన్నారు. ఐదేళ్ల క్రితం తాను ఈ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొన్నానని తెలిపారు. కళలను, కళాకారులను ఆదరిస్తున్న ప్రొద్దుటూరు నాటకకళాపరిషత్ అధ్యక్షుడు రామచంద్రారెడ్డిని అభినందించారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆవిష్కరణలో తాను పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన నాయకుడు ఎన్టీఆర్ అన్నారు.
రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఈ సందర్భంగా లక్ష్మీపార్వతి, ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి, సిండికేట్ బ్యాంకు మేనేజర్ రా«ధశ్రీలను సత్కరించారు. ఏకపాత్రాభినయ పద్మనాటక, నృత్య పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో అవధాని నరాల రామారెడ్డి, సంస్థ గౌరవాధ్యక్షులు సదాశివశర్మ, చిప్పగిరిప్రసాద్, ఉపాధ్యక్షుడు రవికుమార్‌రెడ్డి, సలహా సంఘం అధ్యక్షుడు జింకా మునిస్వామి, సభ్యులు వెంకటరామిరెడ్డి, డాక్టర్ వైవీ రామమునిరెడ్డి, స్పందన అధ్యక్షుడు రాంప్రసాద్‌రెడ్డి, న్యాయవాది జింకా విజయలక్ష్మి, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ అన్నవరం రామ్మోహన్‌రెడ్డి, కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment