
మమత వారసుడు అభిషేక్
సాధారణ కుటుంబంలో పుట్టి రాజకీయాల్లో పోరాట పటిమతో అసాధారణ విజయాలు సాధించిన ఉక్కు మహిళ మమతా బెనర్జీ. రాజకీయాలు, అధికారం ఆమెకు వారసత్వంగా వచ్చినవి కావు. కాంగ్రెస్‌లో పార్టీ సహచరులతో ఒకపక్క, 34 ఏళ్లు వామపక్ష సర్కారుకు నేతృత్వం వహించిన సీపీఎంతో మరోపక్క ఎడతెగని పోరాటం చేశాక 2011లో మమత అధికారంలోకి వచ్చారు. మార్క్సిస్టులను పశ్చిమ బెంగాల్ అధికార పీఠం ‘రైటర్స్ బిల్డింగ్’ నుంచి కూలదోసి తన చిరకాల స్వప్నమైన ముఖ్యమంత్రి పదవిని ఆమె దక్కించుకున్నారు. కాంగ్రెస్ నుంచి వైదొలగి సొంత పార్టీ ఆలిండియా తృణమూల్ కాంగ్రెస్ స్థాపించిన 14 ఏళ్లలోపే సీఎం అయ్యారు.
అత్త అండతో అందలం
సీఎం అయిన ఏడాదికే ఆమె తన తమ్ముడు అమిత్ కొడుకు, మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ఒకే ఒక నిర్ణయంతో 2012లో పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిని చేయగలిగారు. పార్టీలో చేరిన వెంటనే పాతికేళ్ల యువకుడు అభిషేక్‌కు అంత పెద్ద బాధ్యతను మేనత్త అప్పగించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో రాజధాని కోల్‌కతా సమీపంలోని డైమండ్ హార్బర్ నియోజకవర్గం నుంచి అభిషేక్‌ను తృణమూల్ అభ్యర్థిగా బరిలోకి దింపారు మమత. ఆయన తన తొలి ఎన్నికల పోరులో తన సమీప సీపీఎం ప్రత్యర్థి అబుల్ హస్నత్‌ను 71 వేలకు పైగా ఓట్లతో ఓడించారు. లోక్‌సభ సమావేశాలకు ఆయన హాజరు 28 శాతమే కానీ, పశ్చిమ బెంగాల్‌లో మేనత్త మమత ప్రాపకంతో అభిషేక్ తన స్థాయికి మించి అధికారం చెలాయిస్తున్నారు. రాజ్యాంగేతర శక్తి అనే ముద్ర ఇంకా ఆయనకు పడలేదు కానీ, ఆయన మాటను జవదాటే సాహసం పార్టీలో, ప్రభుత్వంలోనూ ఎవరికీ లేదు. 2019 ఎన్నికల్లో మళ్లీ డైమండ్ హార్బర్ నుంచే అభిషేక్ తృణమూల్ తరఫున బరిలోకి దిగుతున్నారు. ఈ స్థానంలో చివరి దశలో మే 19న పోలింగ్ జరుగుతున్న కారణంగా ఆయన రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో ఉధృతంగా పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నారు.
మేనల్లుడి ప్రైవేటు సైన్యం
ప్రభుత్వంలో, పార్టీలో అభిషేక్ పెత్తనం సాగుతుండడంతో సీపీఎం, బీజేపీ ఈ పరిణామంపై విరుచుకుపడుతున్నాయి. ‘ముఖ్యమంత్రి మమత బెంగాల్ ప్రభుత్వాన్ని ప్రైవేటు సైన్యంలా నడుపుతున్నారు. ఆమె మేనల్లుడు రాష్ట్రంలో భయోత్పాతం సృష్టిస్తున్నారు’ అని బీజేపీ నాయకుడు చెప్పారు. నెహ్రూ–గాంధీ కుటుంబం, ములాయం కుటుంబంతో పోలిస్తే బెనర్జీ కుటుంబం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బెంగాల్‌లో కుటుంబ పాలనకు కాస్త నెమ్మదిగానే పునాదులు పడుతున్నాయి. తనకు సీఎం కావడానికి ఎక్కువ సమయం పట్టడంతో చాలా వేగంగా తన మేనల్లుడికి పదవులు, అధికారం అప్పగిస్తున్నారు మమత. మేనల్లుడి దూకుడుగా ఎదిగే క్రమంలో తృణమూల్ బలోపేతం కావడానికి కష్టపడిన అనేక మంది సీనియర్ నేతలు పక్కకు తప్పుకోవాల్సి వస్తోంది. గతంలో తృణమూల్‌లో రెండో స్థానంలో అధికారం చెలాయించిన నేత ముకుల్ రాయ్ ఇటీవల రాజీనామా చేసి బీజేపీలో చేరారు.
అభిషేక్‌ను అడ్డగోలుగా పైకి తీసుకురావడంతో నొచ్చుకున్న ముకుల్ పార్టీ నుంచి బయటికి పోవాల్సి వచ్చింది. జనవరిలో కోల్‌కతాలో ప్రతిపక్ష పార్టీల భారీ రాజకీయ ర్యాలీకి ఏర్పాట్లు చేయడానికి పార్టీ నేతలతో అనేక కమిటీలు ఏర్పాటు చేసినా తెర వెనుక ఈ వ్యవహారం నడిపించింది మాత్రం మమత మేనల్లుడే. మమతను భవిష్యత్తులో బీజేపీయేతర కూటమి ప్రధానిగా ప్రజలకు చూపించే ప్రయత్నాన్ని అభిషేక్ విజయవంతంగా పూర్తి చేశారు. తృణమూల్ వారసత్వ రాజకీయాలకు తెర తీసిందన్న ఆరోపణలు ఖండిస్తూ, ‘బీజేపీ మాదిరిగా కుటుంబ రాజకీయాలపై తృణమూల్‌కు నమ్మకం లేదు. బీజేపీ సీనియర్ నేతలు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్, గోపీనాథ్ ముండే తమ కుటుంబ సభ్యులను పార్టీలోకి తీసుకొచ్చారు’ అంటూ అభిషేక్ వివరించారు. దక్షిణ కోల్‌కతాలో మమత పెరిగిన ఇంట్లోనే అభిషేక్ పెరిగి పెద్దవాడయ్యారు. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్లానింగ్ అండ్ మేనేజ్‌మెంట్‌లో ఆయన ఎంబీఏ (హ్యూమన్ రిసోర్స్ అండ్ మేనేజ్‌మెంట్) చదివారు. పాతికేళ్లకే తృణమూల్ కాంగ్రెస్ యువజన విభాగం నాయకత్వం లభించినా ఇంకా రాజకీయ యుక్తులు, నైపుణ్యాలు నేర్చుకునే దశలోనే అభిషేక్ ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment