మిగిలిన ఉత్తరాది హిందీ రాష్ట్రాల్లో మాదిరిగానే బిహార్‌లో సైతం లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో బీజేపీ నాయకత్వంలోని ఎన్డీఏకు ప్రధాని నరేంద్రమోదీకి ఉన్న జనాకర్షణ శక్తి, సాధించిన విజయాలు, మీడియాలో ఆయనకున్న ‘ఇమేజ్’ ప్రధానాస్త్రాలుగా మారాయి. ఆర్జేడీ నేత, మాజీ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ ఎన్నికల ప్రచారంలో లేకుండా జైల్లో గడపడం ప్రతిపక్షాల మహాగఠ్‌బంధన్‌కు పెద్ద లోటుగా కనిపిస్తోంది. కాని, ఆయన పార్టీ అధికారంలో ఉన్న కాలంలో బడుగు వర్గాలకు చేసిన మేలు, అగ్రవర్ణాలను రాజకీయంగా అదుపులోకి తెచ్చిన తీరు ఆర్జేడీ నాయకత్వంలోని మహా కూటమికి అనుకూలాంశాలుగానే కొంత మేరకు పనిచేస్తున్నాయి. లాలూ ప్రసాద్ తొలిసారి లోక్‌సభకు ఎన్నికైన చప్రా పట్టణంలో బీజేపీ ఆఫీసు నుంచి మోదీ పేరు మార్మోగేలా, ‘‘హర్‌హర్ మోదీ–ఘర్ ఘర్ మోదీ’’, ‘దేశ సైనికులకు గౌరవ మర్యాదలు ఇస్తున్నాం’ అంటూ నినాదాలు వినిపిస్తున్నాయి.
సమీపంలోని ఆర్జేడీ కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి పార్టీ ఎమ్మెల్యే జితేంద్రకుమార్ రాయ్ మాట్లాడుతూ, ‘‘మోదీ–మోదీ అంటూ అరిచేవారికి డబ్బులిస్తున్నారు. కానీ, మన వాళ్లు ఏమీ ఆశించకుండా పని చేయడానికి ముందుకు వస్తున్నారు. ఫేస్‌బుక్, ట్విట్టర్, వాట్సాప్‌లో మా కూటమి తరఫున ప్రచారం చేస్తాం, భయ్యా!’ అంటూ స్థానిక యువకులు ముందుకొస్తున్నారు,’’ అని చెప్పారు. ఇవన్నీ ఒక ఎత్తయితే లాలూ లేని లోటు మరో ఎత్తు. లాలూ ఉంటే ఎన్నికల వ్యూహం భిన్నంగా ఉంటుంది. ఎన్నికల ప్రచా రంలో లాలూ లేని లోటు నిజమేనని జేపీ యూనివర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్ లాల్బాబూ యాదవ్ అభిప్రాయపడ్డారు. ‘‘లాలూజీకి గొప్ప జ్ఞాపకశక్తి ఉంది. నాయకులు, కార్యకర్తల పేర్లన్నీ ఆయనకు ఎరుకే. జనంతో మమేకమౌతూ ప్రచారం చేస్తారు’’ అంటూ ఆయన గుర్తుచేశారు.
ఏ అవకాశం వదలని లాలూ
2015 అసెంబ్లీ ఎన్నికల్లో లాలూ, నితీశ్, కాంగ్రెస్‌తో కూడిన కొత్త కూటమిని లాలూ విజయవంతంగా ముందుకు నడిపించారు. మోదీ నాయకత్వంలోని ఎన్డీఏను ఈ ఎన్నికల్లో మట్టి కరిపించారు. ఈ ఎన్నికల సమయంలోనే ‘రిజర్వేషన్లను సమీక్షించాలి’ అంటూ ఆరెసెస్ అధినేత మోహన్ భాగవత్ ప్రకటన చేయగానే లాలూ ఆయనపై యుద్ధం ప్రకటించారు. బీజేపీ అధికారంలోకి వస్తే భాగవత్ చెప్పినట్టు రిజర్వేషన్లు పోతాయంటూ బీసీల్లో ఉన్న భయాందోళనలను అసెంబ్లీ ఎన్నికల్లో తన కూటమికి అనుకూలంగా లాలూ వాడుకున్నారు. కాని, ప్రస్తుత ఎన్నికల్లో ప్రధానాంశం ‘మోదీ కాదు’ అంటూనే ప్రధానికి పరోక్షంగా ఆర్జేడీ నేతలు ప్రచారం చేస్తున్నారు. మోదీకి ఉన్న జనాదరణ, ఇమేజ్ వల్ల బీజేపీ కూటమికి పెద్ద ప్రయోజనం ఉండదనే మొండి వాదనతోనే ఆర్జేడీ నేతలు, కార్యకర్తలు కాలం గడుపుతున్నారు.
వ్యక్తి పూజకు ఆర్‌ఎస్సెస్ పరోక్ష ఆమోదముద్ర?
సంఘ్ పరివార్ కుటుంబ పెద్ద ఆరెసెస్ కార్యకర్తలు పట్టుదలతో ఇంటింటికీ తిరుగుతూ కేంద్రంలో ఎన్డీఏ సర్కారు సాధించిన విజయాలు, మోదీ శక్తి సామర్థ్యాల గురించి విపరీత ప్రచారం చేస్తున్నారు. సిద్ధాంతరీత్యా వ్యక్తి పూజను వ్యతిరేకించే ఆరెసెస్ కూడా ఇలా వ్యవహరించడం వింతగా ఉన్నా ఎన్నికల్లో ఇది ఎన్డీఏకు అనుకూలాంశంగా మారింది. ఐదేళ్లలో కొత్తగా ఉద్యోగాలు రాక అసంతృప్తితో ఉన్న యువతను బీజేపీకి అనుకూలంగా మలచడానికి తీవ్ర జాతీయవాద భావనలను కాషాయ కార్యకర్తలు ఉపయోగించుకుంటున్నారు. ‘‘దేశం సురక్షితంగా ఉండాలంటే’ మోదీ ముఖం చూసి బీజేపీ కూటమికి ఓటేయాలనే సందేశాన్ని వాడవాడలా వినిపిస్తున్నారు.
ఆర్జేడీని మినహాయిస్తే మిత్రుల బలం అంతంతే!
మహా కూటమిలో ఆర్జేడీని మినహాయిస్తే కాంగ్రెస్, కులాల పునాదులపై ప్రారంభమైన ఆరెలెస్పీ, హెచ్‌ఏఎం, వీఐపీ పార్టీల బలం అంతంత మాత్రమే. ఆయా వర్గాల ప్రజలను ఆకట్టుకోవడంలో వాటి శక్తిసామర్థ్యాలు ఇంకా తేలలేదు. ఈ పార్టీలన్నింటినీ సంస్థాగతంగా ఆర్జేడీ, లాలూ చిన్న కొడుకు తేజస్వీ యాదవ్ వ్యూహాలు, లాలూ చేసిన మేలు వంటి అంశాలే ముందుకు నడిపించాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి పార్టీల మధ్య ఓట్ల బదిలీ ఎలా సాగుతుందనేది కూడా అంచనావేసి చెప్పడం కష్టం. బిహార్‌లో సామాజిక న్యాయం విషయంలో లాలూ ఎంతో సాధించారు. అయితే ఈ అంశానికి ఉన్న పరిమితులే ఆయనను ఒక దశ దాటి ముందుకుసాగనివ్వ లేదు. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన కులాలన్నింటినీ ఓ మేరకు బలోపేతం చేసిన లాలూ చివరికి తన పార్టీని యాదవుల పార్టీగా మార్చారనే చెడ్డ పేరు మిగుల్చుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment