టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి
సాక్షి ప్రతినిధి, ఒంగోలు:‘ఉపయోగ పెట్టుకుంటే ఉపయోగపడతాం..లేకపోతే లేదు..’ నిన్న మొన్నటి వరకూ టీడీపీ ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులురెడ్డి అనుచరుల మాట ఇది. మాగుంట సైతం అంతర్గతంగా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు. ఇప్పుడు మాట మారింది. స్వరం పెరిగింది. అధికార పార్టీలో ఎవరు సంతృప్తిగా ఉన్నారో చెప్పాలంటూ మాగుంట ఏకంగా టీడీపీ జిల్లా మహానాడులోనే ప్రశ్నించారు. ఇది జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా మాగుంట వ్యాఖ్యలు అధికార పార్టీలో కలకలం సృష్టించాయి. మాగుంట పార్టీని వీడతారన్న ప్రచారమూ జోరుగా సాగుతోంది.
ఇన్నాళ్లు జిల్లా టీడీపీ నేతలు మూడుసార్లు పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న మాగుంటను కరివేపాకు చందంగా చూశారు. ఇది మాగుంటతోపాటు ఆయన అనుచర వర్గం, అభిమానులు జీర్ణించు కోలేకున్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను సాధించే పోరాటంలో భాగంగా ప్రతిపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన ఐదుగురు పార్లమెంట్ సభ్యులు తమ సభ్యత్వాలకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సైతం పదవికి రాజీనామా చేశారు. రాజీనామాలు ఆమోదించాలని ఎంపీలు పట్టుబడుతున్నారు. రాజీనామాలు ఆమోదిస్తే ఉప ఎన్నికలు జరిగే అవకాశముందన్న ప్రచారమూ సాగుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ఉప ఎన్నికలు జరిగే అవకాశముందని ఇదివరకే ప్రకటించారు. ఉప ఎన్నికలు వచ్చే పక్షంలో టీడీపీ తరఫున ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా తిరిగి మాగుంట శ్రీనివాసులరెడ్డిని పోటీ చేయించాలని టీడీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే అసంతృప్తితో ఉన్న మాగుంట ఉప ఎన్నికల్లో పోటీకి విముఖంగా ఉన్నట్లు సమాచారం. ఇటీవలే ముఖ్యమంత్రి మాగుంటను పిలిచి ఉప ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండాలని సూచించినట్లు తెలుస్తోంది. ఇందుకు మాగుంట ససేమిరా అన్నట్లు సమాచారం. వేరెవరినైనా పోటీలో నిలిపితే తాను పూర్తిగా సహకరిస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. నీవే పోటీలో ఉండాలంటూ సీఎం మాగుంటపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.
పేరుకు పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడిగా ఉన్నా టీడీపీ జిల్లా నేతలు మాగుంటకు పెద్దగా విలువ ఇవ్వలేదు. ఎమ్మెల్సీగా ఉన్న మాగుంటకు మంత్రి పదవి ఇస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని జిల్లా టీడీపీ ముఖ్య నేతలకు సైతం చెప్పారు. మంత్రి పదవి వచ్చేసినట్లేనని మాగుంటతో పాటు ఆయన అనుచరవర్గం ఆనందపడింది.తీరా చూస్తే మాగుంటకు మంత్రి పదవి దక్కలేదు. మంత్రి పదవి రాకుండా జిల్లా టీడీపీ అధ్యక్షుడితోపాటు ఆ వర్గం నేతలు అడ్డుకున్నట్లు అప్పట్లో ప్రచారం జరిగింది. దీంతో మాగుంటతో పాటు ఆయన అనుచరవర్గం తీవ్ర అసంతృప్తికి లోనైంది.
అధికార పార్టీకి సంబంధించి ఏ కార్యక్రమం జరిగినా మాగుంటకు మొక్కుబడి పిలుపుతో సరిపెడుతున్నారు. ఆయనకు నేతలతో పాటు జిల్లా అధికార యంత్రాంగం సైతం ప్రాధాన్యత ఇవ్వడం లేదు. పనులు జరగకపోవడంతో మాగుంట వద్దకు కార్యకర్తలు వెళ్లే పరిస్థితి లేదు. ఒకప్పుడు కార్యకర్తలు, అభిమానులతో కిటకిటలాడిన మాగుంట కార్యాలయం ఇప్పుడు జనం లేక వెలవెలపోతోంది. ముఖ్యమంత్రి వద్ద జరిగే సమావేశాలకు సైతం మాగుంటను పెద్దగా పిలుస్తున్న పరిస్థితి లేదని తెలుస్తోంది. మాగుంట టీడీపీకి కొత్తకాపు కావడంతో ఆయనకు ప్రాధాన్యత లేకుండా పోయింది.
మాగుంట జిల్లాలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన నేతలను కానీ, పార్టీ అధిష్టానాన్ని కానీ ఇప్పటి వరకూ ఒక్క మాట అనలేదు. కానీ ఇప్పుడు గళం విప్పారు. టీడీపీలో ఎవరూ సంతృప్తిగా లేరని తేల్చి చెప్పారు. అదికూడా సాక్షాత్తు జిల్లా మహానాడులో నేతలు, కార్యకర్తల ముందే విమర్శ చేయడం ఇప్పుడు టీడీపీలో హాట్ టాపిక్. వివాద రహితుడైన మాగుంట ఏకంగా మహానాడులోనే పార్టీపై విమర్శలు చేయడం చూస్తుంటే ఆయన అధికార పార్టీని వీడతారని జోరుగా ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment