
సాక్షి, హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీని వీడనున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి ఊహించని పరిణామం ఎదురైంది. ప్రస్తుత పరిణామాలపై చర్చించేందుకు రాజగోపాల్‌రెడ్డి అంబర్‌పేటలోని కళ్లెం బాల్‌రెడ్డి ఫంక్షన్ హాల్‌లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం ప్రారంభం కాగానే మెజారిటీ కార్యకర్తలు జై కాంగ్రెస్, జైజై కాంగ్రెస్ అంటూ నినాదాలు చేశారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని చెబుతూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయినవారిలో ఒకరైన చౌటుప్పల్ ఎంపీపీ వెంట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తాము కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. కొంత మంది నాయకులు రాజగోపాల్‌రెడ్డిని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీకి వందేళ్ల చరిత్ర ఉందని గుర్తుచేశారు. వ్యక్తిగత కారణాలతోనే రాజగోపాల్‌రెడ్డి పార్టీ మారాలని చూస్తున్నారని విమర్శించారు.
మరోవైపు కార్యకర్తల సమావేశంలో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘కాంగ్రెస్‌ను వీడాలని నిర్ణయం తీసుకున్నాను. నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టడం లేదు. మీరు వచ్చిన రాకపోయిన మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను పదవుల కోసం పార్టీ మారడం లేదు. కేసీఆర్‌ను గద్దె దించడమే నా లక్ష్యం. రాజకీయంగా నన్ను ఏమీ చేయలేక.. నా సుశీ కంపెనీని భూ స్థాపితం చేశారు. నా కుటుంబ సభ్యుడు చిరుమర్తి లింగయ్యను టీఆర్‌ఎస్‌లో చేర్పించుకున్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని నియంతలాగా పాలిస్తున్నారు.. నా నిర్ణయం చరిత్రను మారుస్తుంది. భట్టి విక్రమార్క కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఆత్మ విశ్వాసం కల్పించలేకపోయారు. గెలిచిన ఎమ్మెల్యేలు అమ్ముడుపోతుంటే.. మళ్లీ మిమ్మల్ని ఎందుకు గెలిపించాలని జనాలు అంటున్నారు. తెలంగాణలో ప్రతిపక్షం లేకుండా చూడాలని సీఎం కేసీఆర్ చూస్తున్నారు. మన ఆత్మ గౌరవాన్ని కేసీఆర్ కాళ్ల దగ్గర పెడదమా.. పోరాటం చేద్దామా మీరే నిర్ణయం తీసుకోండి’ అని అన్నారు.
కాగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విమర్శించడమే కాకుండా.. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నయామని వ్యాఖ్యనించిన రాజగోపాల్‌రెడ్డికి టీపీసీసీ షోకాజ్ నోటీసు జారీ చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్‌ను వీడనున్న రాజగోపాల్‌రెడ్డి త్వరలోనే బీజేపీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment