దీదీ ప్రతిష్టకు అగ్ని పరీక్ష  | Mamata Banerjee Face Tough Fight In Final Face Election In Bengal | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ ఆఖరి దశ....   దీదీ ప్రతిష్టకు అగ్ని పరీక్ష 

Published Wed, May 15 2019 7:39 AM | Last Updated on Wed, May 15 2019 7:39 AM

Mamata Banerjee Face Tough Fight In Final Face Election In Bengal - Sakshi

పశ్చిమబెంగాల్‌లోని 9 లోక్‌సభ స్థానాలకు మే 19న చివరిదశలో పోలింగ్‌ జరుగుతుంది. కోల్‌కతా నగరం, దాని పరిసర ప్రాంతాల్లోని డైమండ్‌ హార్బర్, దక్షిణ కోల్‌కతా, ఉత్తర కోల్‌కతా, జాదవ్‌పూర్, బాసిర్‌హాట్, దమ్‌దమ్‌ ప్రధానమైనవి. పట్టణాల్లోని మురికివాడల ప్రజలు తృణమూల్‌కు, పట్టణ ధనిక, మధ్యతరగతి వర్గం సీపీఎంకి ఓటేసేవారు.  ఈసారి నగరంలో వీరంతా బీజేపీకి గానీ కాంగ్రెస్‌కి గానీ ఓటు వేయొచ్చని రాజకీయ పండితుడు రణ్‌బీర్‌ సమందర్‌ అంచనా వేస్తున్నారు. కిందటి ఎన్నికల్లో ఈ 9 సీట్లను తృణమూల్‌ కాంగ్రెస్‌ కైవసం చేసుకుంది. సీఎం, తృణమూల్‌ నేత మమతా బెనర్జీ తన రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన జాదవ్‌పూర్, సౌత్‌ కోల్‌కతా ఆఖరి దశ పోలింగ్‌ జరిగే సీట్లలో ముఖ్యమైనవి.

మమతాబెనర్జీ 1984లో మార్క్సిస్టు దిగ్గజం, మాజీ లోక్‌సభ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీని జాదవ్‌పూర్‌లో ఓడించారు. 1989లో ఇక్కడ ఓడిపోయాక మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతా నుంచి పోటీచేయడం 1991లో మొదలైంది. మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతా నుంచి ఆరుసార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. 1998లో మమతా బెనర్జీ దక్షిణ కోల్‌కతాలోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ని ప్రారంభించారు. 2014లో దక్షిణ కోల్‌కతాలో తృణమూల్‌ నేత సుబ్రతా బక్షీ తన సమీప బీజేపీ అభ్యర్థి తథాగతరాయ్‌ను ఓడించారు. 1995 నుంచి కోల్‌కతా మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌గా ఉన్న మాలారాయ్‌ని ఈసారి తృణమూల్‌ బరిలోకి దింపింది. ఈసారి నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ మనవడు చంద్రకుమార్‌ బోస్‌ని బీజేపీ పోటీకి దింపింది. కాంగ్రెస్‌ తరఫున మితా చక్రబర్తి, సీపీఎం టికెట్‌పై నందినీ ముఖర్జీ పోటీ చేస్తున్నారు. 

మేనల్లుడి సీటులో ‘హీటు’
మరో కీలక స్థానం డైమండ్‌ హార్బర్‌. ఇక్కడి తృణమూల్‌ అభ్యర్థి సిట్టింగ్‌ ఎంపీ, మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్‌ బెనర్జీ మళ్లీ పోటీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ జరిగిన 16 ఎన్నికల్లో రెండుసార్లు కాంగ్రెస్‌ గెలిస్తే, 14 పర్యాయాలు సీపీఎం విజయఢంకా మోగించింది. 2009, 2014 ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఈ సీటుని కైవసం చేసుకుంది. ఇక్కడ  సీపీఎం తరఫున ఫౌద్‌ హలీం, బీజేపీ టికెట్‌పై నీలాంజన్‌ రాయ్, కాంగ్రెస్‌ నుంచి సౌమ్య రాయ్‌ పోటీ చేస్తున్నారు. డైమండ్‌ హార్బర్‌తో పాటు దమ్‌దమ్, బసీర్‌హాట్‌లో గెలుస్తామనే ధీమా బీజేపీలో కనిపిస్తోంది. 

దమ్‌దమ్‌ నియోజకవర్గంలో మొత్తం 11 సార్లు ఎన్నికలు జరిగితే ఐదు సార్లు సీపీఎం, కాంగ్రెస్‌ ఒకసారి, జనతాపార్టీ ఒకసారి, బీజేపీ రెండు సార్లు, తృణమూల్‌ రెండుసార్లు గెలుపొందాయి. కేంద్ర సహాయ మంత్రిగా పనిచేసిన తపన్‌సిక్దర్‌ 1998లో దమ్‌దమ్‌ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. ఒకసారి సీపీఐ సీనియర్‌ నాయకుడు ఇంద్రజిత్‌ గుప్తా ఇక్కడ పోటీ చేసి ఓడిపోయారు. ఉత్తర కలకత్తా నుంచి తృణమూల్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంపీ సుదీప్‌ బంధోపాధ్యాయ పోటీ చేస్తున్నారు. 2014 ఎన్నికల్లో తృణమూల్‌ చేతిలో ఓడిపోయిన రాహుల్‌ సిన్హాని బీజేపీ తిరిగి బరిలోకి దింపింది. సీపీఎం అభ్యర్థిగా కనినికా బోస్, కాంగ్రెస్‌ నుంచి సయ్యద్‌ సాహిద్‌ ఇమామ్‌ పోటీ చేస్తున్నారు.  

ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానం జాదవ్‌పూర్‌ నుంచి ఈసారి తృణమూల్‌ కాంగ్రెస్‌ మిమీ చక్రబర్తిని బరిలోకి దింపింది. 2014  ఎన్నికల్లో ఇక్కడ తృణమూల్‌ అభ్యర్థి సుగతా బోస్‌  విజయం సాధించారు. రెండో స్థానంలో సీపీఐ , బీజేపీ మూడోస్థానంలో నిలిచాయి. ఈసారి పోటీ సీపీఎం, తృణమూల్‌ కాంగ్రెస్‌ల మధ్యే ఉంటుందని భావిస్తున్నారు.  బసీర్‌హాత్‌ నియోజకవర్గం మొత్తం గ్రామీణ ప్రాంతాల్లో విస్తరించి ఉంది. 14,90,596 మంది ఓటర్లున్న ఈ స్థానానికి ఇంద్రజిత్‌ గుప్తాలాంటి కాకలు తీరిన కమ్యూనిస్టు యోధులు ప్రాతినిధ్యం వహించారు. 2014లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి ఇద్రీస్‌ అలీ సీపీఐ అభ్యర్థి నురూల్‌ హుడాపై విజయం సాధించారు. 2009లో ఎస్కే నురూల్‌ ఇస్లాం తృణమూల్‌ టికెట్‌పై గెలుపొందారు. గత ఎన్నికల్లో తృణమూల్‌ కైవసం చేసుకున్న బారాసాత్, జయనగర్, మథురాపూర్‌లో కూడా చివరి దశలో పోలింగ్‌ జరుగుతుంది. 2014 ఎన్నికల్లో బారాసాత్‌లో తృణమూల్‌కి 41.39 శాతం ఓట్లు పోలయ్యాయి. జయ్‌నగర్‌లో సైతం తృణమూల్‌ 41.61 శాతం ఓట్లను సాధించింది. మథురాపూర్‌లో 49.59 శాతం ఓట్లు సాధించిన తృణమూల్‌ ఈ సారి కూడా గెలుపు తమదేనన్న ధీమాతో ఉంది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement