కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం ఉత్కంఠంగా మారింది. బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ నేతల ధర్నాలు, ఆదోళనలు, ఆరోపణలతో రాష్ట్ర రాజకీయం మరింత వేడెక్కింది. ఆరో విడత పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింస మరువక ముందే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ర్యాలీపై టీఎంసీ కార్యకర్తలు రాళ్లురువ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీంతో బెంగాల్‌లోని మమతా బెనర్జీ సర్కారును భర్తరఫ్ చేయాలని బీజేపీ కేంద్ర నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. చివరి విడత ఎన్నికల ప్రచారంలో మమతను పాల్గొననకుండా ఆమెపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇదిలావుండగా బెంగాల్ పోలీసులు అమిత్ షాపై రెండు కేసులు నమోదు చేశారు. ఎన్నికల ర్యాలీ సందర్భంగా హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు.
బీజేవైఎం కార్యకర్త ప్రియాంక శర్మ అరెస్ట్‌పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మమత సర్కారుపై తీవ్ర ఆగ్రహం చేసిన విషయం తెలిసిందే. ఏకపక్షంగా ఆమెను అరెస్ట్ చేశారని.. వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. మరోవైపు ఈశ్వరీచంద్ర విద్యాసాగర్‌రావు విగ్రహాల కూల్చివేతతో బెంగాల్‌లో పలు చోట్ల హింస చేటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బెంగాల్‌లో చోటుచేసుకున్న పరిణామాలపై బుధవారం ఎన్నికల సంఘం అత్యవసరంగా సమావేశమైంది. స్థానిక ఎన్నికల అధికారులతో మాట్లాడి అక్కడి పరిస్థితిపై ఆరా తీస్తోంది. దీంతో ఈసీ నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠం నెలకొంది. మరోపైపు మమత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బెంగాల్ వ్యాప్తంగా బీజేపీ, వామపక్షాలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
టీఎంసీ రౌడీయీజం చేస్తోంది..
రాష్ట్రంలో పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఎంసీ బెంగాల్‌లో రౌడీయీజం చేస్తోందని ఆరోపించారు. ఆయన ర్యాలీపై రాళ్ల దాడి అనంతరం బుధవారం అమిత్ షా ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. మమతపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నిన్నటి హింసాత్మక ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ చేపట్టి.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. టీఎంసీ నేతల నిజస్వరూపం నిన్నటి ఘటనతో పూర్తిగా బయటపడిందని.. బెంగాల్‌లో కమలం వికసించడం ఖాయమన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలో కోసం మమత హింసను ప్రేరేపిస్తున్నారని ధ్వజమెత్తారు. కాగా మే 19న చివరి దశ పోలింగ్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందో ఉత్కంఠంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment