కోల్‌కతా : ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ గత ఆదివారం విడుదలయ్యింది. ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు మొత్తం ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఏడు తనకు అచ్చిరాదంటూ ఆందోళన చెందుతున్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. బెంగాల్‌ను నాశనం చేయాడానికి బీజేపీ కుట్ర చేస్తుందని.. అందుకే ఇలా ఏడు దశల్లో ఎన్నికలు నిర్శహిస్తుందంటూ దీదీ మండి పడుతున్నారు.
మమతా మాట్లాడుతూ.. ‘2014 ఎన్నికల్లో ఐదు దశల్లో పోలింగ్ నిర్వహిస్తామంటేనే ఒప్పుకోలేదు. అలాంటిది ఈ సారి ఏకంగా ఏడు దశల్లో ఎన్నికలను నిర్వహిస్తున్నారు. బెంగాల్‌ను నాశనం చేయడానికే ఇలా ఏడు దశల్లో పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇదంతా బీజేపీ కుట్ర. ఇందుకు తగిన సమాధానం చెప్తాం. బెంగాల్‌లో తృణముల్ కాంగ్రెస్ మొత్తం 42 స్థానాల్లో గెలుస్తుంది. బెంగాల్ ఓటర్లు ఇలాంటి ఎన్నికలను చాలా చూశారు. వారు చాలా తెలివిగల వాళ్లు. బీజేపీ అనుకున్నవేం జరగవు’ అని తెలిపారు.
అంతేకాక ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రల్లో అత్యధిక లోక్‌సభ స్థానాలున్న యూపీ(80), బెంగాల్(42), బిహార్(40) రాష్ట్రాలే కీలక పాత్ర పోషించనున్నాయని మమత తెలిపారు. అంతేకాక ‘గత ఎన్నికల్లో మా పార్టీ తరఫున 34 మంది ఎంపీలు గెలిచారు. ప్రస్తుతం వారిలో ఇద్దరిని పార్టీ నుంచి తొలగించాము. ఈ సారి ఎన్నికల్లో ఈ రెండు నియోజకవర్గాల్లో కొత్త వారు పోటీ చేస్తార’ని తెలిపారు. ప్రజాదరణను బట్టే టికెట్ కేటాయింపులు జరుగుతాయని స్పష్టం చేశారు. అయితే ఈ సారి ఎన్నికల్లో దీదీ 10 నుంచి 12 మంది కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం.
పార్టీ సీనియర్ నాయకులతో చర్చించిన తరువాత మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో లోక్‌సభ బరిలో నిలిచే అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని మమత తెలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ పశ్చిమబెంగాల్‌లో డార్జిలింగ్, అసన్సోల్ నియోజకవర్గాల్లో గెలుపొందింది. ఈ సారి ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుపొందేందుకు బీజేపీ తీవ్రంగా కృషి చేస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment