వేదికపై మాట్లాడుతున్న మందకృష్ణ. చిత్రంలో ఎల్.రమణ, కోదండరాం, వీహెచ్, పొన్నాల, చెరకు సుధాకర్, చాడ తదితరులు
హైదరాబాద్: పంజగుట్టలోని అంబేడ్కర్ విగ్ర హాన్ని డంప్‌యార్డ్‌కు తరలించడంపై త్వరలోనే రాష్ట్రపతి, గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేస్తామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ తెలిపారు. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోకపోవడం, అంబేడ్కర్ జయం తి వేడుకల్లో సీఎం పాల్గొనకపోవడంపై అఖిల పక్షంతో కలసి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను కలసి కారకులపై చర్య లు తీసుకునేలా చేస్తామని వివరించారు. కేసీఆర్ కులవివక్ష చూపుతున్నారని రాష్ట్రపతికి ఫిర్యాదు చేసేందుకు ఈ నెల 20లోపు గడువిసున్నట్లు తెలిపారు. అప్పటికీ స్పందించక పోతే అన్ని రాజకీయ పార్టీలతో కలిసి కేసీఆర్‌ను గద్దె దించేందుకు పోరాడతామని హెచ్చరించారు.
పంజగుట్టలో అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చివేసి డంపింగ్ యార్డులో పడేయడాన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మార్పీఎస్, అంబేడ్కర్ విగ్రహ విధ్వంసక వ్యతిరేక పోరాట కమిటీల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ఇందిరాపార్కు వద్ద మహాగర్జన సభ జరిగింది. ఈ సభకు అంబేడ్కర్‌వాదులు భారీ ఎత్తున తరలి వచ్చారు. తెలంగాణ ఏర్పడితే తొలి సీఎం దళితుడే అని చెప్పి కేసీఆర్ తొలి ప్రభుత్వం దళితు లను మోసం చేసిందని, తాజా ప్రభుత్వం మాత్రం దళితుల ఆరాధ్య దైవమైన అంబేడ్క ర్‌ను అవమానించిందని మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహాన్ని కూల్చేసిన చోటే ప్రతిష్టించాలని, కూల్చివేతకు కారణమైన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం అయినప్పటి నుంచి జగ్జీవన్‌రామ్, అంబేడ్కర్, మహాత్మ జ్యోతి బాపూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొనకుండా ఆ మహనీయులను కేసీఆర్ అవమానించారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాగే ఉంటే దళిత, పేద వర్గాలు ఏకమవుతారని, అంబేడ్కర్ విగ్రహాన్ని చెత్త కుప్పలో వేసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని చెత్తకుప్పలో వేసేంత వర కు నిద్రపోకుండా పనిచేస్తారని హెచ్చరించారు.
125 అడుగుల విగ్రహమేదీ?
125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నెలకొల్పుతామని చెప్పిన కేసీఆర్ ప్రభుత్వం.. ఇప్పటివరకూ దాని ఊసే ఎత్తట్లేదని మండిపడ్డారు. టీజేఏసీ అధ్యక్షుడు కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ సమాజం అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని ముక్తకంఠంతో ఖండిస్తోందని, అంబేడ్కర్‌పై దాడి అంటే రాజ్యాంగంపై దాడి జరిగినట్లు అని పేర్కొన్నారు. తెలంగాణలో పాలనలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగ విలువల కు గౌరవం ఉండట్లేదని ఆరోపించారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయాలని అడిగితే నిర్బంధిస్తున్నారని మండిపడ్డారు.
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాజ్యాంగం, భావస్వేచ్ఛ, పౌరహక్కులను ప్రభుత్వం హరిస్తోందన్నారు. కూల్చిన చోటనే అంబేడ్కర్ విగ్రçహాన్ని ఏర్పా టు చేసే వరకు ఉద్యమించాలన్నారు. కార్యక్రమంలో టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, పోలిట్‌బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, వీహెచ్, వర్కిం గ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్, నేతలు ఫిరోజ్ ఖాన్, అద్దంకి దయాకర్, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీసీ నేత జాజుల శ్రీనివాస్‌గౌడ్, పీవోడబ్ల్యూ నేత సంధ్య, అరుణోదయ విమలక్క, న్యూడెమాక్రసీ గోవర్ధన్, మాలమహనాడు అధ్యక్షుడు దీపక్‌కుమార్, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
కుల వివక్ష చూపుతున్న కేసీఆర్
కేసీఆర్ ప్రభుత్వం కులవివక్షతో వ్యవహరిస్తోందని, 2001 నుంచి 2014 మధ్య కేసీఆర్ ఒక్కసారి కూడా ట్యాంక్‌బండ్‌కు వచ్చి అంబేడ్కర్ విగ్రహానికి దండ వేయలేదని మందకృష్ణ మాదిగ గుర్తు చేశారు. ఎర్రవల్లి గ్రామంలో జరిగిన కార్యక్రమంలో గాంధీ విగ్రహానికి కేసీఆర్ దండ వేసి, పక్కనే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి సర్పంచ్‌తో దండ వేయించాడని చెప్పారు. దీన్నిబట్టి కేసీఆర్‌కు ఉన్న కులవివక్ష ఏంటో అర్థం చేసుకోవచ్చ న్నారు. ఏటా అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు బాపూఘాట్ వద్ద నివాళులర్పించే కేసీఆర్‌కు..ఏప్రిల్ 14న అంబేడ్కర్‌కు నివాళులర్పించే తీరిక లేదా అని ప్రశ్నించారు. అంబేడ్కర్ అంటే అంత చులకన భావం, ఈర్ష్య, ద్వేషం ఎందుకని మండిపడ్డారు. అవినీతి ఆరోపణలతో దళితుడైన రాజయ్యను మం త్రి పదవి నుంచి తొలగించి, ఇంటర్ ఫలితా ల్లో అవకతవకలకు బాధ్యుడైన మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయకపోవడాన్ని బట్టి కేసీఆర్‌కు దళిత వర్గాలంటే ఎంత చులకన భావమో అర్థం అవుతోందన్నారు. తెలంగా ణ రాకముందు దళితులను నమ్మించేందు కు తెలంగాణభవన్ సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టి సీఎం కాగానే దాన్ని తొలగించి అక్కడ తన ఫొటో పెట్టించుకున్నాడని గుర్తుచేశారు. ప్రణబ్‌ముఖర్జీ కాళ్లు మొక్కిన కేసీఆర్, దళితుడైన కోవింద్‌కు మాత్రం పుష్పగుచ్ఛం ఇచ్చి సరిపుచ్చారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment