
హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ కోసం 23 ఏళ్లుగా పోరాడుతున్న మంద కృష్ణ మాదిగ ఉగ్రవాదా అని అఖిలపక్షం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆయన్ను బేషరతుగా విడదల చేయడంతో పాటు కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఈ నెల 27న తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు తమ సంపూర్ణ మద్దతుంటుందని పేర్కొంది.
ఆదివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ అధ్యక్షతన ‘మంద కృష్ణ మాదిగ అరెస్టు, వర్గీకరణ’ అంశంపై అఖిలపక్ష సమావేశం జరిగింది. దీక్షా దివస్ అని గొప్పగా చెప్పుకొంటున్న కేసీఆర్.. దానికి ముగింపుగా మంద కృష్ణ నిమ్మరసం ఇచ్చారన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్ అన్నారు. గతంలో ఎంతోమంది పాలన చేశారు కానీ దళితులపై ఇంత అరాచకంగా ఎవరూ వ్యవహరించలేదన్నారు. రాష్ట్ర బంద్‌కు మద్దతు ప్రకటించారు.
దళితులపై దాడులను వ్యతిరేకించాలి: మోత్కుపల్లి
దళితులపై దాడులకు వ్యతిరేకంగా అన్ని పార్టీలు కలసి పోరాడాలని టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు పిలుపునిచ్చారు. నిజాం నిరంకుశ విధానాలను సమర్థిస్తున్న కేసీఆర్.. అదే పద్ధతులను అమలు చేసేందుకు చూస్తున్నారని ఆరోపించారు. బేషరతుగా మంద కృష్ణను, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు లింగస్వామి మాదిగను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ఎమ్మార్పీఎస్ గురించి ఎవరు మాట్లాడినా అరెస్టు చేసేలా ఉందని, రాష్ట్రంలో రాజ్యహింస పేట్రేగిపోతోందని అరుణోదయ విమలక్క విమర్శించారు. రాజ్యహింసకు వ్యతిరేకంగా ఈ నెల 27న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. సమావేశంలో చింతా సాంబమూర్తి (బీజేపీ), బాలమల్లేశ్ (సీపీఎం), వెంకన్న (ఎమ్మార్పీఎస్), ఓరుగంటి వెంకటేశం (బీసీ సంఘం) తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment