బుధవారం హైదరాబాద్‌లో సినీ నటుడు రాజారవీంద్ర, ఏలూరు మేయర్ నూర్జహాన్, పెద్దబాబు దంపతులు, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, తోట నరసింహం, వాణి దంపతులకు కండువాలు వేసి వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వానించిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్‌సీపీలోకి వలసలు పోటెత్తుతున్నాయి. పలువురు నేతలు, వివిధ రంగాల ప్రముఖుల చేరిక, ఆ సందర్భంగా తరలివస్తున్న వారితో పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసం కిటకిటలాడుతోంది. బుధవారం టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత, కాకినాడ ఎంపీ తోట నరసింహం, ఆయన భార్య తోట వాణి, విజయవాడకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్, విజయవాడ మాజీ మేయర్, సినీ హీరో అల్లు అర్జున్‌కు మేనత్త అయిన రత్నబిందు, సినీ నటుడు రాజా రవీంద్ర, ఏలూరు మేయర్ దంపతులు షేక్ నూర్జహాన్, పెద్దబాబు, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మతో పాటు పలువురు వైఎస్ జగన్‌ను ఆయన నివాసంలో వేర్వేరుగా కలసి వైఎస్సార్‌సీపీలో చేరాలన్న తమ అభీష్టాన్ని వెల్లడించారు. జగన్ వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వీరంతా భారీ సంఖ్యలో తమ అనుచరులతో కలసి రావడంతో జగన్ నివాస పరిసరాలన్నీ జన జాతరను తలపించాయి. ఉదయం మొదలైన పార్టీ చేరికలు సాయంత్రం వరకు కొనసాగాయి. సమయం లేకపోవడంతో బుధవారం విడుదల కావాల్సిన పార్టీ అభ్యర్థుల తొలి జాబితా ప్రకటనను వాయిదా వేశారు.
టీడీపీలో ఘోరంగా అవమానించారు: తోట నరసింహం
ఎంపీ పదవికి, తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసిన తోట నరసింహం, తన సతీమణి వాణితో కలసి మీడియాతో మాట్లాడారు. ఐదేళ్ల పాటు టీడీపీ కోసం ఎంతో కష్టపడితే ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు కనీస గౌరవం కూడా ఇవ్వకుండా ఘోరంగా అవమానించారని వాపోయారు. తాను అనారోగ్యం పాలై ఆస్పత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహానేత వైఎస్సార్ హయాంలో జక్కంపూడి రామ్మోహనరావు ఆర్ అండ్ బీ మంత్రిగా ఉండగా తీవ్ర అస్వస్థతకు గురైతే, ఆయన శాఖ మార్చి ఎక్సైజ్ శాఖను కేటాయించి సహకరించారని నరసింహం గుర్తుచేశారు. తమకు టిక్కెట్ కేటాయింపుపై కూడా చంద్రబాబు హామీ ఇవ్వలేదని, పైగా అణచివేసే యత్నం చేశారని తెలిపారు. టిక్కెట్ కేటాయించక పోవడం కన్నా అవమానాలు భరించలేకే టీడీపీని వీడినట్లు చెప్పారు. జగన్ తమకు ఎక్కడో ఒకచోట టికెట్ ఇస్తారని నమ్ముతున్నట్లు చెప్పారు. ఆయన ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే కాపుల సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని తోట నరసింహం విశ్వాసం వ్యక్తం చేశారు.
జగన్ భరోసా జీవితంలో మరువలేను: తోట వాణి
తన భర్త ఆరోగ్యంపై వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో భరోసా ఇచ్చారని, అది తన జీవితంలో మరిచిపోలేనని తోట వాణి తెలిపారు. జగన్ భరోసాతో తనకు ఎంతో ధైర్యం వచ్చిందన్నారు. వైఎస్సార్‌సీపీలో చేరి చాలా మంచి పని చేసినట్లుగా భావిస్తున్నామని చెప్పారు.
రాజధాని అభివృద్ధిపై జగన్‌కు ఎంతో స్పష్టత ఉంది: పొట్లూరి వరప్రసాద్
దేనికైనా ఒక నిర్మాణాత్మక వ్యూహం, ప్రణాళిక ఉండాలని ప్రముఖ పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ అన్నారు. రాష్ట్ర రాజధాని అభివృద్ధిపై వైఎస్ జగన్‌కు పూర్తి స్పష్టత ఉందని, ఆయనకు ఈ అంశంపై 25 ఏళ్ల సుదీర్ఘ ప్రణాళిక ఉందని చెప్పారు. తాను పేదల ప్రజల సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఆ మార్పును మనం త్వరలోనే చూడబోతున్నామని అన్నారు. తాను పుట్టి పెరిగి, చదువుకున్న విజయవాడ ఎంతో అభివృద్ధి చెంది దేశంలోనే అత్యున్నత నగరాలలో ఒకటి ఎదగాలన్నది తన ఆకాంక్ష అని వెల్లడించారు. ఎవరైతే ప్రజల కోసం నిజంగా కష్టపడతారో వారిని ప్రజలు తప్పనిసరిగా ఆదరిస్తారని వరప్రసాద్ పేర్కొన్నారు. తాను వైఎస్సార్‌సీపీలో చేరిక వెనుక ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని ఆయన స్పష్టం చేశారు.
జగన్ సీఎం అయితే ప్రజలకు మేలు: ఏలూరు మేయర్
పేద ప్రజలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అమలు కావాలంటే వైఎస్ జగన్ సీఎం కావాలని ఏలూరు మేయర్ (టీడీపీ) నూర్జహాన్ పేర్కొన్నారు. ఆయన సీఎం కావాలని ప్రజలంతా ఆశిస్తున్నారని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యేగా ఆళ్ల నానిని గెలిపించి తీసుకొస్తామన్నారు. వైఎస్ జగన్ ఆదేశిస్తే మేయర్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు.
అదృష్టంగా భావిస్తున్నా: రత్నబిందు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం తన అదృష్టంగా భావిస్తున్నానని విజయవాడ మాజీ మేయర్ రత్నబిందు అన్నారు. దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాను మేయర్‌గా పని చేశానని ఆమె గుర్తు చేసుకున్నారు. అప్పట్లో ఆయన అనేక మంచి పథకాలు అమలు చేసి ప్రజాదరణను పొందారని, అటువంటి రాజన్న పాలన వైఎస్ జగన్ వల్లనే సాధ్యమవుతుందని చెప్పారు. ప్రజల పట్ల జగన్‌కు ఉన్న చిత్తశుద్ధి ఏమిటనేది పాదయాత్ర ద్వారా వెల్లడైందని తెలిపారు. జగన్ పట్టుదల, పోరాట పటిమను చూసే తాను పార్టీలో చేరానని ఆమె వివరించారు.
ఐదేళ్లలో ఒక్కసారి కూడా బాబును కలువలేకపోయా: మెట్టు గోవిందరెడ్డి
టీడీపీ కష్టాల్లో ఉన్పప్పుడు ఆ పార్టీలో ఉన్నానని, ప్రభుత్వం వచ్చిన తర్వాత 5 ఏళ్లలో ఒక్కసారి కూడా సీఎం చంద్రబాబును కలువలేక పోయానని మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. విసిగిపోయి మంగళవారం టీడీపీకి రాజీనామా చేశానని చెప్పారు. మెట్టు చేరిక సందర్భంగా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆయన వెంట ఉన్నారు. గోవిందరెడ్డితో పాటు కనేకల్లుకు చెందిన మాజీ సర్పంచ్ మాబుపీరా, సర్పంచ్ తిమ్మప్ప చౌదరిలు పార్టీలో చేరారు. కాగా మెట్టు గోవిందరెడ్డి చేరికతో రాయదుర్గంలో పార్టీ విజయం సాధించినట్లేనని రామచంద్రారెడ్డి చెప్పారు. ఇద్దరం కలసి రాయదుర్గాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్తామన్నారు.
30 ఏళ్లుగా బాబు అన్యాయం: మాజీ ఎమ్మెల్యే బాపనమ్మ
ముప్పై ఏళ్లుగా చంద్రబాబు తమ కుటుంబానికి అన్యాయం చేశారని ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే పర్వత బాపనమ్మ తెలిపారు. వైఎస్ జగన్ తమకు న్యాయం చేస్తామన్నారని, ఎలాంటి షరతులు లేకుండా ఆయన నాయకత్వానికి మద్దతు ఇస్తున్నామని చెప్పారు. ఆమె వెంట అన్నవరం దేవస్థానం డైరెక్టర్ రాజబాబు, జానకీదేవి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్త పర్వత పూర్ణచంద్రప్రసాద్ పాల్గొన్నారు.
మావారితో కలసి ప్రచారం చేస్తా: నటుడు రాజా రవీంద్ర
వైఎస్సార్‌సీపీలో చేరినందుకు సంతోషంగా ఉందని నటుడు రాజా రవీంద్ర అన్నారు. తానే పదవులు ఆశించడం లేదని, పార్టీ గెలుపు కోసం ఇటీవలే పార్టీలో చేరిన సీనియర్ నటి జయసుధ, హాస్య నటుడు అలీతో కలసి ప్రచారం చేస్తానని చెప్పారు.
జేసీ మేనల్లుడు సహా పలువురి చేరిక
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మేనల్లుడు తిరుపతికి చెందిన ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు టీవీ మురళీధర్ రెడ్డి, తిరుపతికి చెందిన రాష్ట్ర బీసీ జేఏసీ చైర్మన్ అన్నా రామచంద్రయ్య యాదవ్, రాజీవ్ నగర్ సర్పంచ్ అన్నా రామకృష్ణ, రాష్ట్ర కురభ సంఘం ఉపాధ్యక్షుడు కె.రెడ్డి కుమార్‌గౌడ్, మాజీ కౌన్సిలర్ డి.శంకర్‌రెడ్డి, రజక సంఘం నాయకుడు అక్కెనపల్లి లక్ష్మయ్య, టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎస్.సాదిక్ భాషా, వడ్డెర సంఘం నాయకులు వి.రమణ, ఎస్.రమణతో పాటు పలువురు పార్టీ ప్రధాన కార్యదర్శి భూమన కరుణాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పార్టీలో చేరారు. అలాగే విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త వెల్లంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన మాజీ కార్పొరేటర్లు మహాదేవు అప్పాజీరావు, శిరంశెట్టి పూర్ణచంద్రరావు, పాత శివాలయం మాజీ చైర్మన్ తంగెళ్ళ రామచంద్రరావు, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పెంటి నాగరాజు, బీసీ ఐక్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాయన శేఖర్‌బాబు, టీడీపీ అర్బన్ మాజీ ఉపాధ్యక్షుడు ఖలీల్, విజయవాడ ముస్లిం జేఏసీ అధ్యక్షుడు మునీర్, కాపు నాయకులు మైలవరపు వీరబాబు, రామిశెట్టి ప్రసాద్, న్యాయవాది పిళ్లా శ్రీనివాస్, ఆర్యవైశ్య నాయకులు బచ్చు రమేష్, దళిత నాయకులు ఎం.శ్రీనివాసరావులు కూడా పార్టీలో చేరారు. వీరివెంట కృష్ణా జిల్లా వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకులు ఉన్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లకు చెందిన నాయిని సూర్యనారాయణ రెడ్డి కూడా పార్టీలో చేరారు. వీరందరికీ జగన్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానం పలికారు.
బ్రాహ్మణ ప్రముఖుల చేరిక
ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ డైరెక్టర్ యామిజాల నరసింహమూర్తి బుధవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరితో పాటు ఆకెళ్ల సుబ్బలక్ష్మి, ఏవీఎన్‌బీ శర్మ, పుట్టంరాజు సీతారామయ్య, ఆకెళ్ల రవికుమార్, కల్లూరి శ్రీనివాస్‌లు కూడా పార్టీలో చేరారు.
జగన్‌తో మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథ్ రెడ్డి భేటీ
వైఎస్సార్ జిల్లా లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే గడికోట ద్వారకానాథ్ రెడ్డి బుధవారం హైదరాబాద్‌లో వైఎస్ జగన్‌తో భేటీ అయ్యారు. ఆయన వెంట మాజీ ఎంపీ పి.మిథున్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment