
సాక్షి, హైదరాబాద్: వామపక్షాల్లోని రెండు ప్రధాన పార్టీలు రాష్ట్రంలో చెరో కూటమి ఏర్పాట్లలో నిమగ్నమయ్యాయి. వామపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తున్నామని బహిరంగంగా మాట్లాడుతున్నప్పటికీ సీపీఎం, సీపీఐ చెరో దారిలోనే పయనిస్తున్నాయి. వివిధ సామాజిక, ప్రజా సంఘాలతో కలసి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ (బీఎల్‌ఎఫ్)ను సీపీఎం ఏర్పాటు చేయగా తెలంగాణ జన సమితి(టీజేఎస్), టీడీపీ, న్యూ డెమోక్రసీ, ఎమ్మార్పీఎస్ వంటి వాటితో మరో వేదికను ఏర్పాటు చేసేందుకు సీపీఐ నిర్ణయించింది.
నియోజకవర్గ సమావేశాల్లో బీఎల్‌ఎఫ్...
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా బీఎల్‌ఎఫ్‌ను బలోపేతం చేయడానికి సీపీఎం కార్యాచరణకు దిగుతోంది. ప్రజాసమస్యలపై పోరాటం చేయాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో ప్రధాన సమస్యలను గుర్తించి, వాటిపై పెద్దఎత్తున కార్యాచరణ చేపట్టాలని బీఎల్‌ఎఫ్ నిర్ణయం తీసుకుంది. ఆ దిశలోనే రాష్ట్రస్థాయిలో పలు సమావేశాలు, సదస్సులను ఇప్పటికే పూర్తి చేసింది. నియో జకవర్గ స్థాయిలో బీఎల్‌ఎఫ్ నిర్మాణాలను చేసుకుంటోంది.
జూన్, జూలై, ఆగస్టులలో బీఎల్‌ఎఫ్‌కు నియోజకవర్గస్థాయి నిర్మాణాలను పూర్తి చేయనున్నారు. దీనికి సమాంతరంగానే మండల, గ్రామ స్థాయిలోనూ బీఎల్‌ఎఫ్ కమిటీల నిర్మాణాన్ని పూర్తి చేస్తున్నారు. నిర్మాణాలు పూర్తి చేసుకున్న నియోజకవర్గాల్లో ఇప్పటికే గుర్తించిన వివిధ ప్రజా సమస్యల పరిష్కారం కోసం జిల్లా, రెవెన్యూ, మండల స్థాయి ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించనున్నారు.
పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి వంటి ప్రధాన సమస్యలపై క్షేత్రస్థాయి కార్యాచరణకు దిగాలని బీఎల్‌ఎఫ్ భావిస్తోంది. గ్రామ, మండల, నియోజకవర్గస్థాయి నిర్మాణాలు పూర్తయిన తర్వాత బహిరంగ సభలను నిర్వహించాలని నిర్ణయించింది. నియోజకవర్గ బీఎల్‌ఎఫ్ కమిటీ సారథ్యంలో ఆగస్టు నెలాఖరులోగా నియోజకవర్గ కేంద్రాలు లేదా మరో ముఖ్య కేంద్రాల్లో బహిరంగ సభలను నిర్వహించనుంది.
ద్విముఖ వ్యూహంలో సీపీఐ
సీపీఎంకు దీటుగా నియోజకవర్గాల్లో బలోపేతం కావాలని సీపీఐ ఏర్పాట్లు చేసుకుంటోంది. సొం తంగా పార్టీ నిర్మాణాన్ని పూర్తి చేయడం, కార్యాచరణకు దిగడం ఒక వ్యూహమైతే... వివిధ పార్టీలు, సామాజిక సంఘాలతో కలసి ఐక్య కార్యాచరణకు దిగాలనే రెండో వ్యూహంతో సీపీఐ పనిచేస్తోంది. ముందుగా పార్టీకి ఎక్కువ బలం ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టింది.
గత ఎన్నికల సందర్భంగా 25 వేల వరకు ఓట్లు వచ్చిన దాదాపు 15 నియోజకవర్గాల్లో కమిటీలను ఏర్పాటు చేయనుంది. తమకు 10 వేల ఓట్ల చొప్పున బలం ఉన్న సుమారు 25 నియోజవర్గాల్లో అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపగల సత్తా ఉందని సీపీఐ భావిస్తోంది. ఎక్కువ బలమున్న 15 నియోజకవర్గాల్లో వెంటనే కమిటీలు వేసి ఆ తర్వాత రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పార్టీ కమిటీలను పూర్తి చేయనుంది.
పార్టీపరంగా సొంత నిర్మాణం పూర్తి చేసుకుంటూనే మిగిలిన పార్టీలతో కలసి ఐక్య కార్యాచరణకూ నేతృత్వం వహించడానికి చర్చలు జరుపుతోంది. ఇప్పటికే టీజేఎస్, టీటీడీపీతో చర్చలను పూర్తి చేసింది. వేర్వేరుగా కార్యాచరణకు దిగుతున్న నేపథ్యంలో వామపక్షాలతో ఐక్య కూటమి సాధ్యమేనా అని ఇరు పార్టీల నేతలు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment