సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్పీ అధినేత్రి మాయావతి వివాదంలో చిక్కుకున్నారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ముస్లింలు కాంగ్రెస్‌కు ఓటు వేయవద్దని కోరుతూ ఆమె చేసిన వ్యాఖ్యలను ఈసీ పరిశీలిస్తోంది. యూపీలోని దియోబంద్‌లో ఆదివారం జరిగిన ఎస్పీ-బీఎస్పీ-ఆర్‌ఎల్డీ ర్యాలీలో మాయావతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మాయావతి ప్రసంగంపై నివేదిక పంపాలని సంబంధిత అధికారులను యూపీ ఎన్నికల ప్రధానాధికారి ఆదేశించారు.
మహాకూటమిని ఓడించేందుకు ముస్లిం ఓట్లలో చీలికకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందని మాయావతి ఆరోపిస్తూ ఆ పార్టీకి ముస్లింలు ఓటు వేయవద్దని కోరారు. బీజేపీని ఓడించాలని భావించే ముస్లింలు యూపీలో మహాకూటమివైపే నిలవాలని సూచించారు. మాయావతి ఇంకా ఏమన్నారంటే..‘ బీజేపీని ఓడించే సామర్ధ్యం కాంగ్రెస్ పార్టీకి లేదు..మహాకూటమితోనే కాషాయ పార్టీని నిలువరించడం సాధ్యం..కాంగ్రెస్‌కు మాత్రం ఓటేయకండి..ఆ పార్టీ మహాకూటమి ఓటమిని కోరుకుంటోంద’ని మాయావతి అన్నారు. మాయావతి వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్న ఈసీ ఆమె వ్యాఖ్యలపై పూర్తి నివేదిక పంపాలని స్ధానిక అధికారులను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment