సాక్షి, సిటీబ్యూరో: పాతబస్తీ పరిధిలో వివిధ రాజకీయ పక్షాలకు ఓటు బ్యాంక్ మెరుగుపడినట్లు కనిపిస్తోంది. హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గంలో పోలింగ్ శాతం తక్కువగా నమోదైనప్పటికీ పోలైన ఓట్లలో బీజేపీ మినహా ఆయా పార్టీలు తమ ఓటు బ్యాంక్ చేజారకుండా మరింత పెంచుకోగలిగాయి. లోక్‌సభ స్థానానికి ప్రధాన పక్షాలైన మజ్లిస్, బీజేపీ నుంచి పాత అభ్యర్థులు తలపడగా, కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పక్షాలు కొత్త ముఖాలను బరిలో దింపాయి. మొత్తం 15 మంది అభ్యర్థులు పోటీ పడగా పోలైన ఓట్లలో సగానికి పైగా ఓట్లను మజ్లిస్ పార్టీ దక్కించుకుంది. గత లోకసభ ఎన్నికల కంటే ఆరు శాతం అధికంగా మజ్లిస్ పార్టీకి ఓట్లు పెరగగా, బీజేపీ మాత్రం ఓట్లు పెంచుకోవడంలో సఫలీకృతం కాలేకపోయింది. గత ఎన్నికల కంటే 6.3 శాతం తక్కువగా ఓటింగ్ శాతం నమోదైంది. శాసనసభ ఎన్నికల కంటే మాత్రం ఓట్ల శాతం పెరిగినట్లయింది. కాంగ్రెస్ పార్టీకి ఐదేళ్ల పాత ఓటు బ్యాంకు మాత్రమే పునరావృత్తమైంది. టీఆర్‌ఎస్ కొంత మొరుగుపడింది. మజ్లిస్ పార్టీకి ఓటు బ్యాంక్ పెరిగినా మెజార్టీలో వెనుకబడింది.
ఎన్నికల బరిలో ఇలా...
హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి నాలుగోసారి సిట్టింగ్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ విజయం సాధించగా, బీజేపీ పక్షాన పోటీ చేసిన భగవంత్‌రావుకు రెండోసారి ఓటమి తప్పలేదు. కాంగ్రెస్ పక్షాన బరిలోకి దిగిన ఫిరోజ్‌ఖాన్‌కు ఘోర పరాభవం తప్పలేదు. ఇప్పటికే ఆయన నాంపల్లి అసెంబ్లీ స్థానానికి మూడుసార్లు పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అధికార టీఆర్‌ఎస్ పక్షాన బరిలో దిగిన న్యాయవాది శ్రీకాంత్ గెలవలేకపోయినా ఓటు బ్యాంక్‌ను పెంచుకోగలిగారు.
సెగ్మెంట్ వారిగా ఇలా...
అసెంబ్లీ సెగ్మెంట్ల వారిగా పరిశీలిస్తే వివిధ రాజకీయ పక్షాలకు ఓటు బ్యాంక్ శాతం పెరిగినట్లు కనిపిస్తోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీకి మలక్‌పేటలో 43.2 శాతం, కార్వాన్‌లో 53.2, చార్మినార్‌లో 53.7, చాంద్రాయణగట్టలో 68, యాకుత్‌పురాలో 49.3, బహదూర్‌పురాలో 75 శాతం ఓట్లు పోలయ్యాయి. బీజేపీకి మలక్‌పేటలో 16.2 శాతం, కార్వాన్‌లో 22.7, గోషామహెల్‌లో 45.4, చార్మినార్‌లో 21.12, చాంద్రాయణగుట్టలో 10.8, యాకుత్‌పురాలో 11.8 శాతం, బహదూర్‌పురాలో 5.7 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌కు నామమాత్రపు ఓట్ల పోలైనప్పటికి ఈ లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం ఓటు బ్యాంక్ మరికొంత మెరుగుపడినట్లు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment