మాట్లాడుతున్న మంత్రి అనిల్, తదితరులు
నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): పోలవరం ప్రాజెక్ట్ పనులను టీడీపీ 70 శాతం పూర్తి చేసిందని నిరూపిస్తే మీసం తీస్తా.. లేకుంటే నువ్వు మీసం తీసి తిరుగు తావా అని టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్ సవాల్ విసిరారు. శుక్రవారం నెల్లూరు స్టోన్‌హౌస్‌పేటలో మంత్రి విలేకరులతో మాట్లాడారు. జీవితంలో ఒక్కసారి కూడా నిజం చెప్పని వారు ఒకే అబద్ధాన్ని పదే పదే చెప్తే అది నిజమవుతుందాని ప్రశ్నించారు. తాను బుల్లెట్ మంత్రినన్నారని, అయితే నా వేగాన్ని అందుకోవడం ఎవరితరం కాదని చెప్పారు. పోతిరెడ్డిపాడు నుంచి ఏడాదికి 400 నుంచి 500 టీఎంసీల నీరు తెచ్చేవాడినని ఉమామహేశ్వరరావు చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఐదేళ్ల టీడీపీ పాలనలో కనీసం 400 టీఎంసీలను కూడా తీసుకురాలేదని ఎద్దేవా చేశారు. నెల్లూరులో నీళ్లు అమ్ముకుంటున్నానని మాట్లాడటం సిగ్గు చేటని విమర్శించారు. ఐదేళ్ల టీడీపీ దోపిడీ పాలనలో నీళ్లు అమ్ముకునే పని చేశారేమోనని తీవ్రంగా ధ్వజమెత్తారు. శ్రీశైలం జలాశయంలో నీటి లెక్కలు ఉంటాయని, వాటిని చూసుకొని బుద్ధి తెచ్చుకొని మాట్లాడాలని హితవు పలికారు. పులివెందులకు నీరిచ్చాం.. వెలిగొండ టన్నెల్‌ను కట్టామని టీడీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 18 కిలో మీటర్ల టన్నెల్లో మూడు కిలో మీటర్లు కూడా నిర్మించని టీడీపీ నేతలు టన్నెల్‌ను నిర్మించామని చెప్పడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. గాలేరు, చిత్రావతి, గండికోటకు వైఎస్సార్ హయాంలో రూ.2,500 కోట్లు ఇస్తే, రూ.150 కోట్లను కూడా ఖర్చు పెట్టలేకపోవడంతో రాయలసీమ నష్టపోయిందన్నారు.
ఆర్‌అండ్‌ఆర్ పనులకు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడంతో రాయలసీమ రైతులు నష్టపోయాన్నారు. వారు చెప్పినట్లే పనులు జరిగి ఉంటే రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కనీసం 10 సీట్లయినా వచ్చుండేవని తెలిపారు. కేవలం రెండు సీట్లతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ నిర్మించిన లెఫ్ట్ కెనాల్‌పై లిఫ్ట్ పంప్ పెట్టుకొని రాష్ట్రంలోని ప్రాజెక్ట్‌లను మేమే పూర్తి చేశామని చెప్పుకొంటున్నారని, మీ బతుక్కి బుద్ధుందానని మండిపడ్డారు. ప్రాజెక్ట్‌లకు రూ.63 వేల కోట్లు ఖర్చు పెట్టామని చెప్పుకొస్తుంటారు. ఎన్ని రూ.కోట్లు దుర్వినియోగం చేశారు?, నీరు – చెట్టు కింద ఎన్ని వేల రూ.కోట్లను స్వాహా చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. దివంగత సీఎం వైఎస్సార్ ప్రారంభించిన పనులను ఐదేళ్ల పాటు వదిలేసి ఎన్నికల ముందు వాటిని చేపట్టి అధికారంలోకి రావడం కోసం అబద్ధాలు చెప్పారన్నారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో మొట్టమొదటిసారిగా సోమశిల జలాశయంలో 78 టీఎంసీల నీరు నిల్వ చేసిన చరిత్ర తమదేనన్నారు. కృష్ణా జిల్లాలోని పులిచింతలలో ఒక్కసారి కూడా పూర్తి నీటి సామర్థ్యాన్ని నిల్వ చేయలేకపోయారు..
తలకాయ ఎక్కడ పెట్టుకుంటారని ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. çపులిచింతలలో పూర్తి నీటి సామర్థ్యాన్ని నిల్వ చేసింది తామేనన్నారు. చరిత్రను సృష్టించడం వైఎస్సార్ కుటుంబానికే చెల్లిందని, మీ లాంటి చచ్చులకు కాదన్నారు. చరిత్ర సృష్టించాలంటే అప్పట్లో రాజశేఖరరెడ్డి, ఇప్పుడు జగన్‌మోహన్‌రెడ్డేనని చెప్పారు. నెల్లూరు జిల్లాలో ఖరీఫ్‌కు ఎప్పుడూ ఇవ్వనంత నీటిని ప్రస్తుతం అందజేస్తున్నామన్నారు. అమ్మడం, కలెక్షన్లు దండుకోవడం టీడీపీ ఐదేళ్ల పాలనలోనే అన్నారు. సంగం, పెన్నా బ్యారేజీలను పూర్తి చేశామని చెప్పుకోవడానికి టీడీపీ నేతలకు సిగ్గుండాలన్నారు. 2014–15లో చంద్రబాబు ఏటా బ్యారేజీలను పూర్తి చేస్తామని గప్పాలు కొట్టారేకానీ చేసిందేమీలేదని విమర్శించారు. డిసెంబర్ నాటికి నెల్లూరు బ్యారేజీని సీఎం జగన్‌మోహన్‌రెడ్డితో ప్రారంభిస్తామని వెల్లడించారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేదిలేదన్నారు. ప్రాజెక్ట్‌లపై చేసిన తప్పులు ఒప్పుకోవాలని టీడీపీ నేతలకు హితవు పలికారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు ముక్కాల ద్వారకానాథ్, రూప్‌కుమార్‌యాదవ్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment