ఎన్ఎండీసీ నుంచే విశాఖ స్టీల్‌కు ముడి ఖనిజం | Minister Dharmendra Pradhan Reacts On MP Vijaya Sai reddy Questions In Rajyasabha | Sakshi
Sakshi News home page

ఎన్ఎండీసీ నుంచే విశాఖ స్టీల్‌కు ముడి ఖనిజం

Published Wed, Jul 24 2019 6:01 PM | Last Updated on Wed, Jul 24 2019 6:34 PM

Minister Dharmendra Pradhan Reacts On MP Vijaya Sai reddy Questions In Rajyasabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : విశాఖ ఉక్కు కర్మాగారానికి అవసరమయ్యే ముడి ఇనుప ఖనిజంలో అత్యధిక శాతం నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)కు చెందిన బైలదిలా గనుల నుంచే సరఫరా జరుగుతుందని ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ తెలిపారు. రాజ్య సభలో బుధవారం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిస్తూ ఇనుప ఖనిజం సరఫరాకు సంబంధించి ఎన్‌ఎండీసీతో విశాఖ ఉక్కు కర్మాగారం దీర్ఘ కాలిక ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. విశాఖ ఉక్కుకు ఏటా 10.26 మిలియన్‌ టన్నుల ఉక్కు ఖనిజం అవసరం ఉంటుంది. అందులో 8.7 మిలియన్‌ టన్నులు ఎన్‌ఎండీసీకి చెందిన బైలదిలా గనుల నుంచే సరఫరా జరుగుతుంది. మిగిలిన ఇనుప ఖనిజం ఒడిసా మైనింగ్‌ కార్పొరేషన్‌కు చెందిన కర్నాటకలోని దైతరి గనుల నుంచి సేకరించడం జరుగుతోంది. పశ్చిమ ఒడిసాలోని గంధమర్థన్‌ గనుల నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు ఒడిశా మైనింగ్‌ కార్పొరేషన్‌తో విశాఖ ఉక్కు ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని మంత్రి తన జవాబులో స్పష్టం చేశారు.

క్రూడాయిల్‌ కోసం ఏ దేశంతోను జత కట్టలేదు
ముడి చమురు కొనుగోళ్ళ కోసం భారత్‌ ఏ దేశంతోను ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని రాజ్య సభలో  విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు జవాబిస్తూ పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ చెప్పారు. దేశ ఇంధన భద్రతా ప్రయోజనాల పరిరక్షణ కోసం భారత్‌ వివిధ దేశాలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతుంటుందని అన్నారు.

తిరుపతిలోని సంస్కృత విద్యాపీఠ్‌కు సెంట్రల్‌ వర్శిటీ హోదా
తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం డీమ్డ్‌ యూనివర్శిటీకి సెంట్రల్‌ యూనివర్శిటీ హోదా కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. 60 ఏళ్ళ చరిత్ర కలిగి, ఆధునిక శాస్త్రాలతోపాటు ప్రాచీన శాస్త్రాలలో సైతం ఉన్నత విద్యా బోధనలో ఎనలేని సేవ చేస్తున్న ఈ సంస్కృత విద్యాపీఠ్‌కు సెంట్రల్‌ యూనివర్శిటీ హోదా కల్పించాలని కోరుతూ రాజ్య సభలో జూలై 2న విజయసాయి రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. దీనిపై స్పందించిన మానవ వనరుల శాఖ సహాయ మంత్రి సంజయ్‌ ధోత్రే ప్రభుత్వ నిర్ణయాన్ని లేఖ ద్వారా విజయసాయి రెడ్డికి తెలిపారు. డీమ్డ్‌ యూనివర్శిటీలుగా కొనసాగుతున్న ఢిల్లీలోని రాష్ట్రీయ సంస్కృత సంస్థాన్, శ్రీ లాల్‌ బహదూర్‌ శాస్త్రి రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్‌, తిరుపతిలోని రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠ్‌లను చట్ట సవరణ ద్వారా ఒకే ఛత్రం కిందకు తీసువచ్చి వాటికి సెంట్రల్‌ యూనివర్శిటీ హోదా కల్పించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ప్రతిపాదనపై ప్రస్తుతం వివిధ మంత్రిత్వ శాఖలు సంప్రదింపులు జరుపుతున్నట్లు చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement