సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలోకి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి అనుమతి నిరాకరించడంపై కాంగ్రెస్ రాజకీయం చేస్తోందని నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. ఉద్యమ సమయంలో యూనివర్సిటీలో పోలీసు కాల్పుల్లో గాయపడ్డ వారిని పరామర్శించేందుకు వెళ్లిన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను గేటు దగ్గరే అరెస్ట్ చేయించిన విషయం కాంగ్రెస్ నేతలు మరిచారా అని ప్రశ్నించారు. అప్పటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి రక్తాలు కారుతున్న విద్యార్థులను కనీసం పరామర్శించలేదని గుర్తు చేశారు. ప్రస్తుతం ఓయూ ప్రశాంతంగా ఉందని, రాహుల్ వస్తే ఆ వాతావరణం దెబ్బతింటుందని వీసీ అనుమతి నిరాకరించడంలో తప్పేముందని ప్రశ్నించారు. ఆదివారం తెలంగాణభవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో హరీశ్ మాట్లాడారు. అమరవీరుల స్తూపానికి రాహుల్ గాంధీ నివాళులు అర్పిస్తారన్న ప్రకటనపైనా ఆయన మండిపడ్డారు. ‘1969లో 369మంది ఉద్యమకారులను పిట్టల్లాకాల్చి చంపించిందెవరు.. ఇందిరాగాంధీ ప్రభుత్వం కాదా.. 2009లో డిసెంబర్ 9 ప్రకటనను కాంగ్రెస్ వెనక్కి తీసుకుంటే మళ్లీ ఆత్మహత్యలు జరిగాయి. ఆ అమరత్వానికి కాంగ్రెస్ కారణం కాదా? చంపేది మీరే.. నివాళులర్పించేది మీరే’అంటూ తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. రాహుల్ నివాళులు అర్పించినంత మాత్రన కాల్చిన గాయాలను మాన్పలేరని చెప్పారు.
పార్లమెంట్‌లో ఎప్పుడైనా ప్రశ్నించారా?
తెలంగాణ హక్కుల గురించి ఒక్కరోజైనా పార్లమెంట్‌లో రాహుల్ గాంధీ మాట్లాడలేదని హరీశ్ విమర్శించారు. విభజన చట్టంలో రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా కల్పించాలని అడగలేదని చెప్పారు. పోలవరానికి జాతీయ హోదా ఇస్తుంటే ప్రాణహిత, పాలమూరులకు హోదా గురించి ఎందుకు మరిచారని ప్రశ్నించారు. హైకోర్టు విభజనపై సైతం రాహుల్ ఇప్పటివరకు నోరుమెదపలేదన్నారు. తెలంగాణ నుంచి 7 మండలాలను ఆంధ్రాలో కలిపేందుకు పూర్తి మద్దతిచ్చింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా అడుగుతున్న రాహుల్, తెలంగాణలోని వాణిజ్య, వ్యాపారులకు సమాన రాయితీలపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. సీడబ్ల్యూసీలో తెలంగాణ నుంచి ఒక్క నాయకుడికి అర్హత లేదా అని ప్రశ్నించారు. జాతీయ పార్టీలు రాష్ట్రాన్ని చిన్న చూపు చూస్తున్నాయని విమర్శించారు. ఈ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ మాత్రమే శ్రీరామరక్ష అని, అది అర్థమయ్యే ప్రజలు ప్రతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తున్నారని చెప్పారు.
విద్యుత్, వ్యవసాయంలో దేశానికే ఆదర్శం
కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోతలు, విత్తనాలు, ఎరువుల కొరత, రుణాల కోసం ధర్నాలు, లాఠీచార్జీలే గుర్తొస్తాయని హరీశ్ విమర్శించారు. సాగు, తాగు, విద్యుత్, వ్యవసాయానికి ధీమా కల్పించ డంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. ‘ఎన్నికల్లో ఇచ్చిన హామీలతో పాటు, ఇవ్వనివి కూడా నెరవేర్చాం. రైతుబంధు, రైతు బీమా పథకాలను తీసుకొచ్చాం. రాష్ట్రప్రభుత్వ పనితీరు చూసి కర్ణాటక, మహారాష్ట్రలోని కొన్ని గ్రామాల ప్రజలు తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారు. నాలుగేళ్లలో 14 లక్షల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చాం. రూ.12 వేల కోట్లు రైతుబంధుకు ఖర్చు చేస్తున్నాం. కాంగ్రెస్ పాలనలో ఏ ఒక్క సమస్యనైనా శాశ్వతంగా పరిష్కరించారా? ఆరు దశాబ్దాల్లో ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా తెలంగాణ ఉంది. ఇతర రాష్ట్రాలు సైతం తెలంగాణను ఆదర్శంగా తీసుకుంటున్నాయి. కాంగ్రెస్ హయాంలో ఒక్క ప్రాజెక్టైనా పూర్తయిందా.. దేశాన్ని సుదీర్ఘంగా పాలించి ఒక్క సమస్యకైనా శాశ్వత పరిష్కారం చూపిందా’అని ప్రశ్నించారు. ఉద్యోగాల కల్పనపై కాంగ్రెస్ గోబెల్స్ ప్రచారం చేస్తోందని ఆరోపించారు. తాము లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పామని, అందుకు కట్టుబడి ఉన్నామని స్పష్టంచేశారు. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు తెలుసని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు భంగపాటు తప్పదని హరీశ్ హెచ్చరించారు.
చంపిన చేతులతో.. నివాళులా?
Published Mon, Aug 13 2018 1:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment