గాంధీభవన్ వద్ద నిరసన తెలుపుతున్న ఎమ్మెల్యే జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్/ ఉస్మానియా యూనివర్సిటీ: రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి రాహుల్ గాంధీ టూర్ టెన్షన్ పట్టుకుంది. రాహుల్‌గాంధీని ఎట్టి పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీకి తీసుకెళ్లాలనే పట్టుదలతో ఉన్న నేతలు.. హైకోర్టును ఆశ్రయిం చినప్పటికీ ఊరట లభించలేదు. తొలుత.. రాహుల్‌గాంధీ ఓయూ సందర్శనకు అనుమతి ఇవ్వాల్సిందిగా వీసీని కోర్టు ఆదేశించిందంటూ వచ్చిన వార్తలతో సంబరపడిన నేతలు.. ఆ తర్వాత పిటిషన్‌ను కోర్టు డిస్మిస్ చేసిందని తేలడంతో నిరాశలో మునిగిపోయారు. రాహుల్ సందర్శనను అనుమతిం చాల్సిందిగా ఓయూ వీసీని ఆదేశించలేమని హైకోర్టు చెప్పడం, రాహుల్ టూర్ దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ ఇరకాటంలో పడింది. ఏడో తేదీన రాహుల్ షెడ్యూల్‌పై మల్లగుల్లాలు పడుతోంది.
మరోమారు వీసీని కలిసి విజ్ఞప్తి చేయాలనే ఆలోచనలో కాంగ్రెస్ వర్గాలున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాహుల్‌ను ఓయూ కు తీసుకెళ్లాలా వద్దా అన్న అంశంపై గురువారం తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఈ మేరకు మార్పులతో గురువారం నాడే పూర్తి స్థాయి షెడ్యూల్ విడుదల చేయనున్నారు. ప్రస్తుతమున్న షెడ్యూల్ ప్రకారం ఈనెల 6న వరంగల్ రైతు సంఘర్షణ సభలో పాల్గొననున్న రాహుల్ ఏడో తేదీన ఉదయం నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌లో పర్యటిస్తారు. ముందుగా పలువురు ప్రముఖులు, అమరవీరుల కుటుం బాలతో సమావేశం కానున్నారు. తర్వాత గాంధీభవన్‌కు వచ్చి పార్టీ నేతలతో సమావేశమవుతారు. ఆ తర్వాత ఉస్మానియాకు వెళ్తారని, లేదంటే నేరుగా చంచల్‌గూడ జైలుకు వెళ్లి ఎన్‌ఎస్‌యూఐ నాయకులతో ములాఖత్ అవుతారని తెలుస్తోంది.
చలో ప్రగతి భవన్‌ను అడ్డుకున్న పోలీసులు
రాహుల్ ఓయూ సందర్శనకు మంగళవారం వరకు అనుమతి రాకపోవడం, వీసీ, గవర్నర్‌లు అందుబాటులో లేని నేపథ్యంలో బుధవారం చలో ప్రగతి భవన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు సాయంత్రం ఎమ్మెల్యే జగ్గారెడ్డి నేతృత్వంలో ఓయూ విద్యార్థి సంఘాల నేతలు, ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు గాంధీభవన్ నుంచి బయలుదేరగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో జగ్గారెడ్డి బృందం గాంధీభవన్ ప్రాంగణంలోనే నిరసనకు దిగింది. తమను అనుమతించేంతవరకు అక్కడే ఉంటామని చెప్పి లోపల బైఠాయించారు. ఈ సమయంలో కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినట్టు సమాచారం రావడంతో ఆందోళన విరమించుకున్నారు. అనంతరం ఓయూ విద్యార్థి నాయకులతో కలిసి జగ్గారెడ్డి విలేకరులతో మాట్లాడారు. రాహుల్‌ను ఓయూకి అనుమతించకుండా ఇబ్బంది పెట్టడం ద్వారా తెలంగాణ ఇచ్చిన సోనియా కుటుంబం పట్ల కేసీఆర్‌కు కృతజ్ఞతాభావం లేదని అర్థమయిందని చెప్పారు.
ఓయూలో కొనసాగుతున్న ఆందోళనలు
రాహుల్ సందర్శనకు అనుమతి ఇవ్వాలంటూ ఓయూలో విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం తెలంగాణ విద్యార్థి, నిరుద్యోగ ఫ్రంట్ చైర్మ న్ చనగాని దయాకర్‌గౌడ్, ఎన్‌టీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు బైరు నాగరాజు ఆధ్వర్యంలో చేపట్టిన మహార్యాలీని పోలీసులు అడ్డుకోవడం ఉద్రికత్తకు దారి తీసింది. మరోవైపు వామపక్ష విద్యార్థి నేతలు ఆర్‌ఎన్ శంకర్, రవినాయక్, నాగేశ్వర్‌రావు, శరత్‌నాయక్, స్వాతిలను పోలీసులు అరెస్ట్ చేసి ఓయూ పీఎస్‌కు తరలించారు. ఓయూలో ఎలాంటి ఆందోళనలకు అనుమతి లేదని సీఐ రమేష్‌నాయక్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment