టీడీపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా? | Minister Kanna Babu Slams TDP Over Farmers | Sakshi

టీడీపీకి రైతుల గురించి మాట్లాడే హక్కు ఉందా?

Sep 25 2019 8:10 PM | Updated on Sep 25 2019 8:36 PM

Minister Kanna Babu Slams TDP Over Farmers - Sakshi

చంద్రబాబు సర్కార్‌ నిర్వాకం వల్ల వడ్డీలే కట్టుకోలేక..

సాక్షి, అమరావతి : ఎన్నికల ప్రయోజనాల కోసం రుణ ఉపశమనం పేరుతో తెలుగుదేశం పార్టీ రైతులను నిలువునా మోసం చేసిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి కె.కన్నబాబు విమర్శించారు. ఐదేళ్లు రైతులను మోసం చేసిన టీడీపీ నేతలకు రైతుల గురించి మాట్లాడే హక్కుఉందా?అని ప్రశ్నించారు. ఈ మేరకు బుధవారం ఆయన ఓ పత్రికా ప్రకటన విడుదల చేశారు. రుణమాఫీ చేస్తానని మభ్యపెట్టి వారిని నిలువునా ముంచేయలేదా అని నిలదీశారు. రైతు రుణాలు సుమారు రూ.87 వేల కోట్లకు పైగా ఉంటే.. దానిని రూ.24 వేల కోట్లకు తగ్గించిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వందేనని అన్నారు. అయితే గడిచిన ఐదేళ్లలో రైతులకు ఇచ్చింది రూ.15,279.42 కోట్లు మాత్రమేనని అన్నారు. మొత్తం రుణమాఫీని ఎందుకు చేయలేకపోయారో  చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

చంద్రబాబు సర్కార్‌ నిర్వాకం వల్ల వడ్డీలే కట్టుకోలేక రైతులు నానా అగచాట్లు పడ్డారని అన్నారు. సున్నావడ్డీ పథకానికీ మంగళంపాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4, 5 విడతల కింద చెల్లించాల్సిన డబ్బును చంద్రబాబు ఎగ్గొట్టారని ఆరోపించారు. 4, 5 విడతల కింద చెల్లించాల్సిన సొమ్ము సుమారు రూ.7,958 కోట్లు అయితే... 2018 మార్చిలో అని, తర్వాత జులై అని, అక్టోబరు అని, డిసెంబరు అని... చివరకు ఎన్నికల నోటిషికేషన్‌ ఒకరోజు ముందు జీవో ఇవ్వడం సిగ్గనిపించలేదా చంద్రబాబుగారూ.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌లో కూడా నిధులు కేటాయించలేదని, ఇదేనా రైతుల పట్ల చంద్రబాబుకు వున్న చిత్తశుద్ది అని ప్రశ్నించారు. ఆ మభ్యపెట్టే జీఓతోనే ఇప్పుడు మళ్లీ మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. 

అయిదేళ్ల పాలనలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు రైతు రుణ ఉపశమనాన్ని పూర్తిగా అమలు చేయలేక వైఫల్యం చెందారని ఆరోపించారు. చంద్రబాబు మాదిరిగా కాకుండా రైతులకు ఆర్థిక చేయూతను చిత్తశుద్దితో అందించాలని, రైతులను మభ్యపెట్టే విధానాలకు స్వస్తి పలకాలని ఆనాడు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిగారు తన పాదయాత్ర సందర్బంగా అప్పటి పాలకులకు హితవు పలికిన విషయాన్ని గుర్తు చేశారు. వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే రైతు భరోసా కింద రైతులకు నిజమైన మేలు చేసి చూపుతామంటూ ఆయన ప్రకటించారని అన్నారు. దీనిలో భాగంగా నవరత్నాల్లో రైతు భరోసాకు స్థానం కల్పించారని తెలిపారు. తెలుగుదేశం ప్రభుత్వం మాదిరిగా రైతులను పదేపదే మోసగించే విధానాలకు స్వస్తి చెప్పేందుకు రైతు భరోసాను పకడ్బందీగా అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు ప్రారంభించారని అన్నారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు సర్కార్‌ రెండు విడతల రైతు రుణ ఉపశమనం కోసం జారీ చేసిన జీఓ 38ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. రైతులకు ఆర్థిక చేయూతను ఇచ్చేందుకు అక్టోబర్‌ పదిహేనో తేదీ నుంచి రైతు భరోసా పథకాన్ని సీఎం జగన్‌ ప్రభుత్వం అమలులోకి తీసుకువస్తోందని ప్రకటించారు. రైతు భరోసా పథకం కింద మొత్తం 64.06 లక్షల మంది రైతులకు మేలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దీనిలో 15.36 లక్షల మంది కౌలు రైతులు వున్నారని తెలిపారు. వీరికి ఏడాదికి 12,500 రూపాయలను రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా చెల్లించబోతోందని తెలిపారు. అలాగే 48.70 లక్షల మంది సొంతభూమి కలిగిన రైతులకు కూడా 12,500 రూపాయలు రైతు భరోసా ద్వారా లబ్ది చేకూరుతుందని తెలిపారు. 

గత తెలుగుదేశం ప్రభుత్వం రైతు రుణ ఉపశమనం పేరుతో నాలుగు, అయిదో విడతల్లో దాదాపుగా 7958 కోట్ల రూపాయల మేరకు రైతులకు చెల్లించాల్సి వుందని తెలిపారు. ఈ మొత్తం కన్నా అధికంగా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు రైతు భరోసాను ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చిందని అన్నారు. దీనివల్ల రుణమాఫీ కింద చెల్లించాల్సిన మొత్తం కన్నా అదనంగా రైతులకు ప్రయోజనం చేకూరనుందని తెలిపారు. ఇందుకోసం గత ప్రభుత్వం జారీ చేసిన జీఓ 38ని రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని మంత్రి కె.కన్నబాబు వివరణ ఇచ్చారు. అంటే అయిదో విడతలో రుణమాఫీ ద్వారా కేవలం 36.68 లక్షల మంది రైతులకు మాత్రమే లబ్ధి చేకూరుతుండగా, రైతు భరోసా కింద దానికి రెట్టింపు సంఖ్యలో.. 64.06 లక్షల మందికి ఆర్థిక ప్రయోజనం అందుతుందని వెల్లడించారు.  
    
రాష్ట్రంలో రైతాంగాన్ని ఆదుకునేందుకు పంటల బీమా పథకానికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియాన్ని కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఇందుకోసం ఏడాదికి సుమారు రూ.2163.30 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తోందని అన్నారు. అలాగే రైతులకు వడ్డీలేని రుణాల కింద దాదాపు 3360 కోట్ల రూపాయలను అందించేందుకు చర్యలు తీసుకుంటోందని తెలిపారు. అలాగే దురదృష్టవశాత్తు అప్పుల బాధ తాళలేక ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఏడు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా కింద అందిస్తోందని తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement