
సాక్షి, అమరావతి: ప్రత్యేక హోదా వద్దని గతంలో సీఎం చంద్రబాబే చెప్పారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ అన్నారు. ప్రత్యేక హోదా వల్ల రూ. 3 వేల కోట్లకు మించి రాష్ట్రానికి రాదని పలుమార్లు సీఎం చంద్రబాబు అన్నట్లు ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికల్లో వార్తలు వచ్చాయని, ఆ క్లిప్పింగ్‌లు తన వద్ద ఉన్నాయని ఎమ్మెల్యే సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక హోదాతో పూర్తి స్థాయిలో రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదని సీఎం వ్యాఖ్యానించారన్నారు. మంగళవారం శాసనసభలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ ప్రసంగించారు.
మిత్రపక్షం ఎమ్మెల్యే ప్రసంగానికి సీఎం చంద్రబాబు అడ్డుకున్నారు. సభను తప్పుదోవ పట్టించడం సరికాదన్నారు. ప్రత్యేక హోదాతో రూ. 3 వేల కోట్లు వస్తాయని తానెప్పుడూ అనలేదన్నారు. ఒకవేళ తాను అన్నట్లు ‘సాక్షి’ పత్రికలో వచ్చి ఉంటే తానేమీ చెప్పలేనన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని హామీలను నెరవేర్చమని మాత్రమే కేంద్రాన్ని కోరుతున్నాం తప్ప అదనంగా ఏమీ అడగడం లేదని సీఎం చంద్రబాబు అన్నారు. దక్షిణాదిలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ తలసరి ఆదాయం రూ.35 వేలు తక్కువగా ఉందన్నారు. బీజేపీ నేతలు ఇక్కడ అనవసరంగా మాట్లాడకుండా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రానికి ఏం చేశారో సమీక్ష చేయించాలని చంద్రబాబు సలహా ఇచ్చారు.
అనంతరం ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రసంగం కొనసాగిస్తూ.. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రత్యేక హోదా కొనసాగుతుందనే ప్రచారం వాస్తవం కాదన్నారు. విభజన చట్టంలో లేనివి కూడా రాష్ట్రానికి కేంద్రం ఎన్నో ఇచ్చిందన్నారు. కేంద్రం అన్ని ప్రాజెక్టులకు రూ.9,750 కోట్లు సాయం చేసిందని, ప్రపంచ బ్యాంకు నుంచి హుద్‌హుద్ తుపాను సాయానికి రూ.2,500 కోట్లు, డ్వాక్రా గ్రూపులకు రూ.750 కోట్లు, విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు రూ.6,500 కోట్లు మంజూరు చేసినట్లు వివరించారు. 2014–15 రెవెన్యూ లోటు అంకెల్లో కేంద్రం, రాష్ట్రం మధ్య వ్యత్యాసం ఉందన్నారు. రైల్వే జోన్ కోసం వైజాగ్‌లో నిరసన కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే సమక్షంలో ప్రధాని మోదీ మాస్క్ ధరించిన వ్యక్తిని మహిళలతో కొట్టించడం దారుణమన్నారు. ఎయిమ్స్‌కు కేటాయించిన స్థలంలోని టవర్‌ను తొలగించడానికి రాష్ట్ర ప్రభుత్వానికి మూడున్నరేళ్ల సమయం పట్టిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment