
కాశీకాలనీలో బాధితులతో కొఠారు రామచంద్రరావు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మరోసారి రెచ్చిపోయారు. ఈసారి జానెడు జాగాలో తలదాచుకుంటున్న బడుగులపై తన ప్రతాపం చూపించారు. ప్రభుత్వ స్థలంలో ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న పేదలపై దాడికి దిగి వారిని అక్కడి నుంచి వెళ్లిపోవాలని హెచ్చరించారు. పిల్లలకు అన్నం పెడుతున్న గిన్నెలను కూడా గిరాటేసి దాడికి పాల్పడ్డారు. గన్‌మెన్లతో వారి సామాన్లు బయట పడేయించారు.
కాళ్లపై పడ్డా కనికరించలేదు
దెందులూరులో శనివారం ఉదయం ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా కాశీకాలనీలోకి తన అనుచరులతో వెళ్లిన ఎమ్మెల్యే ప్రభాకర్ అక్కడ రెవెన్యూ సిబ్బంది పాతిన జెండాలను గమనించారు. అందులో తాము ఎన్నో ఏళ్లుగా ఉంటున్నట్లు నిరుపేదలైన చుక్కా లక్ష్మీ, శ్రీను, చుక్కా లక్ష్మీదుర్గ, కొండలు ఎమ్మెల్యేకు తెలిపారు. అందుకు రుజువుగా వారి పేరు మీద ఉన్న కరెంటు బిల్లులతోపాటు తెలిసిన వారి దగ్గర కొనుగోలు చేసిన పట్టా కాగితాలు చూపారు. అయితే అవేమి పట్టించుకోని చింతమనేని వారిని దుర్భాషలాడుతూ దాడికి దిగారు. వారు కాళ్ల మీద పడినా కనికరించలేదు. రెండు కుటుంబాలకు చెందిన భార్యాభర్తలను కొట్టారు. ఆ స్థలాల్లో ఉండటానికి వీల్లేదని హెచ్చరించారు. పిల్లలకు అన్నం పెడుతుంటే గిన్నెలను కాలితో తన్నేశారని, ఎమ్మెల్యే కొడుతుంటే ఆయన గన్‌మెన్‌లు గెంటేశారని బాధితురాలు చుక్కా లక్ష్మి కన్నీటిపర్యంతమైంది. ఎంతో కష్టపడి కొనుక్కున్న స్థలాన్ని ఇలా అర్ధాంతరంగా లాగేసుకుంటే తాము ఎక్కడికి వెళ్లి బతకాలని ఆక్రోశించింది. తమ కాలనీలో టీడీపీకి చెందిన ఎంతో మంది భూమి కొనుగోలు నివసిస్తుంటే చింతమనేనికి తామే దొరికామా అంటూ రోదిస్తున్నారు.
గన్‌మెన్‌లను దుర్వినియోగం చేస్తున్నారు: కొఠారు
ఇదే ప్రాంతంలో తియ్యాల రామారావు, దుంగల రంగమ్మ, రేట్ల ఎర్రమ్మ, ఎఎన్‌ఎం నాగలక్ష్మీలకు చెందిన స్థలం ప్రహరీ గోడలను కూడా తొలగించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ కన్వీనర్ కొఠారు రామచంద్రరావు సంఘటనా స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించారు. పేద కుటుంబాలు అప్పు చేసి చిన్నపాటి స్థలం కొనుక్కుని ఇళ్లు వేసుకుని జీవిస్తుంటే వారిపై చింతమనేని ప్రతాపం చూపించడం ఏమిటని కొఠారు రామచంద్రరావు నిలదీశారు. ఇకపై ఇలాంటివి సహించబోమని హెచ్చరించారు. ‘మీ పార్టీ కానివారిని కొడతారా? మీ పార్టీ కానివారి ఇళ్లను తొలగిస్తారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ విప్‌గా ఇచ్చిన గన్‌మెన్‌లను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గన్‌మెన్‌లు ఎమ్మెల్యే రక్షణ కోసం కాకుండా ప్రజలపై దాడులు చేయడం సరికాదన్నారు. అనంతరం ఆయన స్థానిక తహశీల్దార్‌ను కలిసి బాధితులు ఆధారాలు చూపేందుకు గడువు ఇవ్వాలని కోరారు.
అక్రమణలో ఉందని కూల్చివేసిన గోడ