సాక్షి, తిరుపతి: రాష్ట్ర ప్రయోజనాల కోసమే టీఆర్‌ఎస్‌తో తమ పార్టీ చర్చలు జరిపిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా తెలిపారు. వైఎస్ జగన్, కేటీఆర్ చర్చలు జరిపితే చంద్రబాబు ఎందుకు వణికిపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. గురువారం ఆమె ‘సాక్షి’ టీవీతో మాట్లాడుతూ.. చంద్రబాబు, టీడీపీ కారణంగానే ఆంధ్రప్రదేశ్‌కు నష్టం జరిగిందన్నారు. వైఎస్ జగన్ ఏది చేసినా బురద చల్లమే పనిగా పెట్టుకున్నారని టీడీపీ నాయకులపై మండిపడ్డారు.
‘కేటీఆర్‌తో వైఎస్ జగన్ మాట్లాడమే తప్పు అంటున్నారు టీడీపీ నాయకులు. ఇద్దరు యంగ్ డైనమిక్ నాయకులు కలిస్తే ఎందుకు వణికిపోతున్నారు? అమరావతి శంకుస్థాపనకు తెలంగాణ సీఎం కేసీఆర్‌ను చంద్రబాబు పిలవడమే కాకుండా రాయిమీద ఆయన పేరు చెక్కించారు. టీడీపీ నేతలు ఆ రోజు ఎందుకు ప్రశ్నించలేదు.. గాడిదలు కాస్తున్నారా? కేసీఆర్ మెప్పు కోసం చంద్రబాబు 36 వంటకాలు చేయించి దగ్గరుండి వడ్డించారు. అప్పుడేమైంది మీ బుద్ధి? కేసీఆర్‌కు దేవినేని ఉమా విజయవాడలో సన్మానం చేశారు. పరిటాల సునీత కొడుకు పెళ్లిలో కేసీఆర్ మెప్పు కోసం టీడీపీ నేతలు చేసిన ప్రదక్షిణలను అందరూ చూశారు. మీ రాజకీయ లబ్ధి కోసం ఎన్ని వేషాలైనా వేస్తారు. హైదరాబాద్‌లో ఉండేందుకు పదేళ్లు గడువున్నా ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కుని విజయవాడకు చంద్రబాబు పారిపోయి వచ్చారని అందరికీ తెలుసు. ఎంతసేపూ ఎవరితో పొత్తు పెట్టుకుందామా అని చంద్రబాబు ఆలోచిస్తుంటారు. మీరు ఎన్ని పార్టీలతో కలిసి వచ్చినా జగన్ సింగిల్‌గానే ఎన్నికలకు వస్తారు. రాష్ట్రానికి మంచి జరిగే విషయమైతే ఎవరితోనైనా జగన్ సంప్రదింపులు జరుపుతారు. జగన్ విశ్వసనీయతపై అందరికీ నమ్మకముంది. ఏపీకి నష్టం కలిగించిన కాంగ్రెస్, బీజేపీకి ప్రత్యామ్నాయంగా ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబుకు ఈ విషయం తెలియదా? జగన్‌ను విమర్శించే అర్హత చంద్రబాబుకు లేద’ని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment