
సాక్షి, హైదరాబాద్: ప్రతిపక్షం లేకుండా తెలుగుదేశం ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్న తీరు ఎన్టీఆర్ ట్రస్టు భవన్‌లో శిక్షణ తరగతుల్లా ఉన్నాయిగానీ శాసనసభ హూందాకు తగ్గట్టు లేవని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు ప్రతిపక్షంలో కూర్చోబెడతారని సీఎం చంద్రబాబుకు అర్థమైనందునే ప్రతిపక్షనాయకుడిగా ఎలా వ్యవహరించాలో తన కుమారుడు, మంత్రి లోకేశ్‌కు శిక్షణ ఇస్తున్నారని రోజా అన్నారు.
హైదరాబాద్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అసెంబ్లీకి రాకపోవడంపై టీడీపీ నేతలు చేస్తున్న విమర్శలను ఆమె గట్టిగా తిప్పిగొట్టారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్షం భయపడి పారిపోయిందని సీఎం విమర్శించడంపై ఆమె స్పందిస్తూ..‘హైదరాబాద్‌ను పదేళ్లు ఉమ్మడి రాజధానిగా వినియోగించుకునే అవకాశం ఉన్నా ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిన చంద్రబాబు అమరావతిలో దాక్కున్నారు. దీన్ని పారిపోవటం అంటారు. బాబు అండ్ కో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తుంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే ఉద్దేశంతో జగన్ ప్రజల మధ్యలో ఉంటూ రచ్చబండ, పల్లెనిద్ర చేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తుంటే చూసి భయపడుతున్నది చంద్రబాబే. అక్రమాలను లెక్కలతో సహా చూపించి జగన్ నిలదీస్తారనే వణుకు టీడీపీని వెంటాడుతోంది. అందుకే గతేడాది, ఈ ఏడాది అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నిర్వహించలేదు’ అని విమర్శించారు.
స్పీకర్ యాక్టింగ్ దురదృష్టకరం: పార్టీ ఫిరాయించిన వారిపై స్పీకర్ కోడెల చర్యలు తీసుకోకుండా ఆ విషయం కోర్టు పరిధిలో ఉందంటూ యాక్టింగ్ చేయడం దురదృష్టకరమని రోజా విమర్శించారు.గతంలో తనను సస్పెండ్ చేసినపుడు సుప్రీం కోర్టు సింగిల్ జడ్జి తనకు అనుకూలంగా తీర్పునిస్తే.. సీఎం చంద్రబాబు, స్పీకర్, మంత్రి యనమల కలిసి అసెంబ్లీకి స్పీకరే సుప్రీం అన్నారన్న విషయం గుర్తుచేశారు. ఫిరాయింపుదారులపై అనర్హత వేటు విషయానికి వచ్చే సరికి కోర్టు పరిధిలో ఉందని ఎందుకు చెబుతున్నారో వారే వివరించాలన్నారు. పార్టీ ఫిరాయించిన వారికి మంత్రి పదవులు ఇవ్వడం టీడీపీకే సిగ్గుచేటని విమర్శించారు. ప్యారడైజ్ పేపర్లపై అనుకూల పత్రికల్లో కథనాలు రాయించి దానిపై చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని రోజా దుయ్యబట్టారు. ఈ విషయంలో జగన్ సవాల్‌ను సీఎం స్వీకరించాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment