సాక్షి ప్రతినిధి, ఒంగోలు: చంద్రబాబు సర్కారుపై ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కరణం బలరాం ఫైర్ అయ్యారు. వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధి గురించి ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దొనకొండ ప్రాంతానికి పరిశ్రమలు రాకుండా అడ్డుకుంటున్నారంటూ పరిశ్రమల శాఖామంత్రి అమర్‌నాథ్‌రెడ్డిపై విరుచుకుపడ్డారు. బుధవారం శాసనమండలిలో మంత్రి అమర్‌నాథ్‌రెడ్డిని ప్రశ్నలతో కరణం బలరాం ఉక్కిరిబిక్కిరి చేశారు. దొనకొండ ప్రాంతంలో ఎన్ని పరిశ్రమలు రాబోతున్నాయంటూ ప్రశ్నించారు. ప్రస్తుతానికి అలాంటి ప్రతిపాదనలేవీ లేవంటూ మంత్రి సమాధానమివ్వడంతో బలరాం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
వచ్చిన పారిశ్రామికవేత్తలను తిరుపతి, వైజాగ్, గన్నవరం ప్రాంతాలకు తీసుకెళ్తుంటే దొనకొండకు ఎలా పరిశ్రమలొస్తాయంటూ నిలదీశారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తానే దొనకొండను పారిశ్రామికంగా అభివృద్ధి చేస్తామని ఆశించినా.. అది జరగలేదంటూ బలరాం మండిపడ్డారు. దొనకొండ పరిశ్రమలు ఎందుకు రావడం లేదంటూ అమర్‌నాథ్‌రెడ్డిని నిలదీశారు. ‘దొనకొండ ప్రాంతంలోనే తొలుత రాజధాని నిర్మిస్తారనుకున్నాం.. దాన్ని అమరావతికి తరలించినా అంగీకరించాం.. దొనకొండ ప్రాంతంలో పెద్ద ఎత్తున పరిశ్రమలు నెలకొల్పి అభివృద్ధి చేస్తారని భావించాం.. నాలుగేళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఒక్క పరిశ్రమ కూడా రాకపోతే ఎలా..? అంటూ బలరాం ప్రశ్నించారు. ఒక్క పరిశ్రమ కూడా రాకపోతే వెనుకబడిన ప్రకాశం జిల్లా ఎలా అభివృద్ధి సాధిస్తుందని కరణం ప్రశ్నించారు.
ఏపీ పటం నుంచి ప్రకాశం జిల్లానుతొలగించారా..?
13 జిల్లాల ఏపీ చిత్రపటంలో ప్రకాశం జిల్లాను తొలగించారా..? అంటూ బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. దొనకొండ ప్రాంతంలో బ్రిటీష్ కాలంలోనే విమానాశ్రయం నిర్మించారన్నారు. ఇక్కడ రైల్వే జంక్షన్ కూడా ఉందన్నారు. వెలిగొండ ఫేజ్–1 పనులు పూర్తయితే తగినంత నీరు అందుబాటులో ఉంటుందన్నారు. అదీ కాకపోతే 10 కి.మీ. కెనాల్ తవ్వితే నాగార్జునసాగర్ వాటర్ సైతం అందుబాటులో ఉంటుందని బలరాం తెలిపారు. అయినా, ఇక్కడికి పరిశ్రమలను ఎందుకు రానివ్వడం లేదంటూ మంత్రిని ప్రశ్నించారు. ఇక్కడకు వస్తున్న వారిని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా ప్రజలకు తామేం సమాధానం చెప్పాలంటూ నిలదీశారు. మొత్తంగా వెనుకబడిన ప్రకాశం జిల్లా అభివృద్ధిని ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ బలరాం ఆగ్రహం వ్యక్తం చేయడం, మంత్రిని నిలదీయడం జిల్లాతో పాటు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామని చివరకు మంత్రి హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment