డీఎస్ హూడా, రాహుల్
ఛండీగఢ్: రెండేళ్ల క్రితం కశ్మీర్‌లోని నియంత్రణ రేఖ వెంబడి ఉగ్రవాదుల శిబిరాల్ని ధ్వంసం చేసిన సర్జికల్ దాడులు మరోసారి వార్తల్లో నిలిచాయి. ఉడీ దాడికి ప్రతీకారంగా చేపట్టిన ఈ మెరుపు దాడులపై తొలినాళ్లలో సంబరాలు చేసుకోవడం సహజమేనని, కానీ అదే పనిగా ఆ విజయాన్ని ప్రచారం చేయడం తగదని మాజీ లెఫ్టినెంట్ జనరల్ డీఎస్ హూడా అన్నారు. 2016, సెప్టెంబర్ 29న సర్జికల్ దాడులు జరిగిన సమయంలో హూడా నార్తర్న్ ఆర్మీ కమాండర్‌గా పనిచేస్తున్నారు.
ఛండీగఢ్‌లో శుక్రవారం ప్రారంభమైన మిలిటరీ సాహిత్య వేడుకలో ‘సీమాంతర ఆపరేషన్లు, సర్జికల్ దాడుల పాత్ర’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. మిలిటరీ చర్యల్ని రాజకీయం చేయడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. సర్జికల్ దాడుల ఆపరేషన్‌ను రహస్యంగా చేస్తే బాగుండేదని ఓ ప్రేక్షకుడు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానంగా చెప్పారు. ఉగ్రవాదుల ఆవాసాల్ని కకావికలం చేయడమే కాకుండా వారి మనోధైర్యాన్ని దెబ్బతీయడం కూడా ఈ ఆపరేషన్ వ్యూహాత్మక లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలకు దిగే ముందు శుత్రు మూకలపై వాటి ప్రభావం దీర్ఘకాలం కొనసాగేలా చూసుకోవాలని సూచించారు. పంజాబ్ గవర్నర్ వీపీ బాద్నోర్, పలువురు మాజీ ఆర్మీ కమాండర్లు కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆర్మీని సొంత ఆస్తిలా భావించారు: కాంగ్రెస్
డీఎస్ హూడా నిజమైన సైనికుడిలా మాట్లాడారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ కితాబిచ్చారు. సర్జికల్ దాడుల్ని మోదీ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకున్నారన్నారు. ‘ మిస్టర్ 36( 36 రఫేల్ విమానాల కొనుగోళ్లనుద్దేశిస్తూ) మిలిటరీని నిస్సిగ్గుగా తన సొంత ఆస్తిలా వాడుకున్నారు. రఫేల్ ఒప్పందంతో అనిల్ అంబానీకి రూ.30 వేల కోట్ల లబ్ధి చేకూర్చారు’ అని ట్వీట్ చేశారు. సర్జికల్ దాడులపై ఛాతీ చరుస్తూ మోదీ చేసిన చిల్లర రాజకీయాల్ని హూడా బట్టబయలు చేశారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. జాతీయ భద్రత, వ్యూహాత్మక ప్రయోజనాలపై రాజీపడి ప్రధాని దేశం ముందు దోషిగా నిలబడ్డారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment