ఎన్సీపీ అధ్యక్షుడు, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా (ఫైల్)
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో ప్రధాని మోదీ హవా తగ్గడంతో.. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో బాలాకోట్‌లో వైమానిక దాడులను కేంద్రం నిర్వహించిందని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధినేత, జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో మోదీ హవా బాగా నడిచిందని, ఇప్పుడా పరిస్థితి లేకపోవడంతో పాక్‌ను దెబ్బకు దెబ్బ తీయగలమని ప్రజలను నమ్మించడానికి బాలాకోట్ దాడులకు ఆర్మీని కేంద్రం ఆదేశించిందని ఫరూక్ అబ్దుల్లా పేర్కొన్నారు. ‘పాకిస్థాన్‌ను దెబ్బతీశామని అంటున్నారు. కానీ బాలాకోట్ దాడి తర్వాత పాక్ ప్రతిదాడితో మనం కూడా సొంత యుద్ధ విమానాన్ని కోల్పోయాం. ఆ వైమానిక దాడుల్లో 300 మందిని చంపామంటున్నారు. అంతమందిని చంపడం తప్పుకాదా? ఇది అంతర్జాతీయ సమాజానికి దుఃఖ సంఘటనే కదా! దీన్ని ప్రశ్నించిన వాళ్లను జాతి ద్రోహులుగా, పాకిస్థానీయులుగా చిత్రీకరిస్తున్నార’ని ఆయన మండిపడ్డారు.
హనుమంతుడినని నమ్మించే ప్రయత్నం
‘అయోధ్య రామమందిర వివాద ప్రస్తావన ఇప్పుడెవరూ తీసుకురారు. బాలాకోట్ దాడులకు ముందు అందరూ (బీజేపీ) రామమందిరం గురించే మాట్లాడేవారు. కానీ ఇప్పుడా విషయాన్ని మరుగునపడేశారు. తాను హనుమంతుడినని, పాక్‌ను ఢీకొనే సత్తా తనకు మాత్రమే ఉందని ప్రజలను నమ్మించే ప్రయత్నాల్లో వాళ్లు (బీజేపీ) బిజీగా ఉన్నార’ని ఫరూక్ అబ్దుల్లా చురకలంటించారు. ఈ వ్యాఖ్యలను ఖండించిన జమ్మూకశ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్.. ఫరూక్ అబ్దుల్లా ఎంపీ అభ్యర్థిత్వాన్ని రద్దు చేయాలని ఎన్నికల కమిషన్‌కు అభ్యంతరాలు తెలపడానికి సిద్ధమయ్యారు. జమ్మూకశ్మీర్‌లోని 6 లోక్‌సభ సీట్లలో ఎన్నికలు 5 దశల్లో జరుగనున్నాయి. బారాముల్లా, జమ్మూ నియోజకవర్గాల్లో పోల్స్‌ను మొదటి విడతలో నిర్వహించనున్నారు. శ్రీనగర్, ఉద్ధంపూర్‌లో రెండో విడతలో, అనంత్‌నాగ్‌లో నాలుగు, ఐదు విడతల్లో.. లడఖ్‌లో 5వ దశలో ఎన్నికలు జరుగుతాయి.
Comments
Please login to add a commentAdd a comment