సమావేశంలో మాట్లాడుతున్న డాక్టర్ మోహన్‌బాబు
పాకాల : చరిత్రలో వంచన, దగా, మోసం..వీటికి మరో పేరు ఏదైనా ఉందంటే అది నారా చంద్రబాబునాయుడేనని మాజీ రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు డాక్టర్ మోహన్‌బాబు అన్నారు. మంగళవారం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పాకాలలో ఏర్పాటు చేసిన సమావేశంలో మోహన్‌బాబు మాట్లాడారు. దేశ రాజకీయాలను మార్చగలిగే శక్తి ప్రజలకుందని, రాజకీయాల్లో కులాన్ని కాకుండా గుణాన్ని చూడాలని విజ్ఞప్తి చేశారు. ఓటుకు నోటు కేసులో రాత్రికిరాత్రి సర్దుకుని దొంగచాటుగా అమరావతికి పయనమైన వాడు చంద్రబాబేనని అపహాస్యం చేశారు. సొంత మామ ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచి ఆయన పేరును చెడగొడుతున్నాడని విమర్శించారు. రాజకీయాల్లో కొత్త మార్పులు రావాలి, యువత ఆవేశం, ఆలోచనలు రాష్ట్రానికి అవసరమని గుర్తు చేశారు. ప్రస్తుతం ప్రజల్లో వస్తున్న మార్పులతో చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే పలు సభల్లో తలాతోక లేని మాటలు, పొంతన లేని సమాధానాలు చెబుతున్నారని మండిపడ్డారు.
అధికారంలో ఉన్నారు కాబట్టే చంద్రబాబుపై ఉన్న కేసులను తొక్కిపెట్టి, ప్రజల మధ్య తానో ఉత్తముడిలా నటిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఐదేళ్ల పరిపాలనలో అభివృద్ధి శూన్యమని, చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆస్తుల మాత్రం పెంచుకున్నారని ఆరోపించారు. చంద్రబాబు ప్రజలను వంచించే పచ్చి అబద్ధాలకోరు అని, దీనిని ప్రజలు గుర్తించాలన్నారు. జగన్.. జనం ముందు టీడీపీ చిత్తుచిత్తుగా ఓడిపోతుందని, చేసిన తప్పులకు చంద్రబాబు జైలు పాలు కావడం ఖాయమని జోస్యం చెప్పారు. వైఎస్సార్‌సీపీ ప్రకటించిన మేనిఫెస్టోతో అన్ని వర్గాల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు వైఎస్సార్‌సీపీ ని ఆశీర్వదించి అధికారం కట్టబెట్టాలని కోరారు. చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ప్రజల మనిషి అని, కార్యకర్తల కోసం ఎంత దూరమైనా రాగలిగే ధైర్యశాలి అని కొనియాడారు. ఈసారి కూడా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఎల్‌బీ ప్రభాకర్, నంగా పద్మజ, సర్పంచ్ కస్తూరి, పలువురు వైఎస్సార్ సీపీనాయకులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment