
ఎన్టీఆర్‌తో తన అనుబంధాన్ని విజయసాయిరెడ్డికి వివరిస్తున్న మోత్కుపల్లి
సాక్షి, హైదరాబాద్: దళితులకు పదవులు రాకుండా అడ్డుపడ్డ వ్యక్తి చంద్రబాబు నాయుడు అని మాజీ మంత్రి, తెలంగాణలో టీడీపీ బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. నమ్మిన వాళ్ల గొంతు కోసే నమ్మక ద్రోహి చంద్రబాబు అని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో దళితులు, అన్ని రాజకీయ పక్షాలు కలిసి చంద్రబాబును చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి గురువారం హైదరాబాద్‌లో మోత్కుపల్లి నర్సింహులును ఆయన నివాసంలో కలిశారు. తెలుగుదేశం పార్టీలో తనకు జరిగిన అన్యాయాన్ని నర్సింహులు ఈ సందర్భంగా వివరించారు.
ఎవడబ్బ సొమ్మని ఖర్చు పెడుతున్నావ్
‘‘చంద్రబాబూ.. నీకు చేతనైతే సొంతంగా పార్టీ స్థాపించి, ఎన్నికల్లో గెలిచి చూపించు. కమ్మ కులంలో చెడపుట్టిన వ్యక్తి చంద్రబాబు. ఎవరబ్బ సొమ్ము విచ్చలవిడిగా ఖర్చు పెట్టావ్. పార్క్ హయత్ హోటల్‌లో రూ.7 లక్షల బిల్లు కట్టావు, ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్తున్నావు. ఇదంతా ఎవరి సొమ్మని ఖర్చు చేస్తున్నావ్? రూ.లక్షల కోట్ల నల్లధనం అక్రమంగా సంపాదించావు. ఇది నిజం కాదా? నారా లోకేశ్ కూడా అక్రమంగా సంపాదిస్తున్నాడు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలి. నాపై సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నారు. దీన్ని ఏమాత్రం సహించను. నన్ను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తే పరామర్శించడానికి కొందరు వైఎస్సార్‌సీపీ నేతలు వస్తున్నారు. వీలైతే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో కలసి పాదయాత్రలో పాల్గొంటా. జగన్ వెంట నడుస్తా. వీలైతే సభల్లో ప్రసంగించి, చంద్రబాబును ఓడించాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలను కోరుతా. ఈ వారంలో తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తా. చంద్రబాబును ఓడించాలని, అతడు రాజకీయాల్లో ఉండకుండా చూడాలని వేంకటేశ్వరుడిని ప్రార్థిస్తా. తర్వాత జగన్‌మోహన్‌రెడ్డిని కలుస్తా’’అని మోత్కుపల్లి చెప్పారు.
అన్ని కులాలపై జగన్ కుటుంబానికి ప్రేమ
‘‘దళితులంటే వైఎస్ జగన్ కుటుంబానికి ఎనలేని ప్రేమ, గౌరవం. ఈ కులం, ఆ కులం అనే తేడా లేకుండా అన్ని కులాల వారిని వైఎస్ కుటుంబీకులు గౌరవిస్తారు, అక్కున చేర్చుకుంటారు. చంద్రబాబు పతనం కోసం అన్ని పార్టీలూ ఏకమై పోరాడాలి. పవన్ కల్యాణ్‌ను వాడుకొని వదిలేశాడు. ప్రధాని నరేంద్ర మోదీని మోసం చేశాడు. ఓటుకు కోట్లు కేసులో ఫోన్‌లో మాట్లాడిన గొంతు చంద్రబాబుదే. బాబుకు నిజంగా ధైర్యం ఉంటే రాజీనామా చేయాలి. చంద్రబాబుకు పిచ్చి రోగం వచ్చింది. లోకేశ్‌ను తప్ప పార్టీలో ఇంకెవరినీ గుర్తుపట్టడం లేదు. ఆంధ్రప్రదేశ్‌కు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంత కాలం ప్రత్యేక హోదా రాదు. ఇతరులు అధికారంలోకి వస్తేనే ప్రత్యేక హోదా సాధ్యం. దళితుల మధ్య విద్వేషాలు సృష్టించింది చంద్రబాబు కాదా? దళిత సోదరులంతా ఏకమై బాబును ఓడించాలి’’అని నర్సింహులు పిలుపునిచ్చారు.
బాబు నైజం అదే: విజయసాయిరెడ్డి
దళిత నేత మోత్కుపల్లిని టీడీపీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయడం దారుణమని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన మోత్కుపల్లి నర్సింహులును కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. అవసరానికి ఉపయోగించుకొని, వదిలేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని, అదే ఆయన నైజమని పేర్కొన్నారు. దళితుల పట్ల వివక్ష ఉన్న నేత చంద్రబాబు అని మరోసారి రుజువైందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment