విలేకరులతో మాట్లాడుతున్న రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్. చిత్రంలో మోత్కుపల్లి, వివేక్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ గరికపాటి మోహన్‌రావు ఆధ్వర్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఇరువురు 15 నిమిషాలపాటు ఏకాంతంగా చర్చించుకున్నట్టు తెలిసింది. తెలంగాణలో రాజకీయ పరిస్థితులను షాకు మోత్కుపల్లి వివరించినట్టు సమాచారం. ఈ నెల 9న హైదరాబాద్‌లో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా సమక్షంలో మోత్కుపల్లి అధికారికంగా ఆ పార్టీలో చేరనున్నారు.
నియంతపాలనకు ముగింపు పలకండి
బీజేపీలో చేరే విషయమై ముందుగా అమిత్ షాతో మాట్లాడాలన్న యోచన మేరకు రాష్ట్ర నేతల ఆధ్వర్యంలో ఆయనతో సమావేశమై పలు అంశాలపై చర్చించినట్టు మోత్కుపల్లి మీడియాకు తెలిపారు.ఈ భేటీ సందర్భంగా తాను చెప్పిన విషయాలను సాంతం విన్న అమిత్ షా తీరు సంతోషకరమన్నారు. తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నియంత పాలనకు ముగింపు పలకాలని షాను కోరినట్టు తెలిపారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే శక్తి ఒక్క బీజేపీకే ఉందని, అందుకే చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. పదవులపై తనకు ఆశలేదని, ఆ విషయం పార్టీ అధిష్టానం చూసుకుంటుందని బదులి చ్చారు. బడుగు, బలహీన వర్గాలు, దళితుల కోసం అలుపెరగని పోరాటం చేసిన మోత్కుపల్లి బీజేపీలో చేరిక పార్టీకి బలాన్ని చేకూరుస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment