
కిర్లంపూడి (జగ్గంపేట): ‘నీకు పిల్లనిచ్చి వివాహం జరిపించిన ఎన్టీ రామారావుపైనే చెప్పులు వేయించావ్. ఇప్పుడేమో ఓట్ల కోసం చెప్పులు విడిచి ఆయన విగ్రహానికి ఒంగి ఒంగి దొంగ నమస్కారాలు పెడుతున్నావ్’ అంటూ సీఎం చంద్రబాబుపై కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ధ్వజమెత్తారు. సోమవారం ఆయన సీఎం చంద్రబాబుకు ఓ లేఖ రాశారు. హామీలను నెరవేర్చాలని అడిగితే.. కులాల మధ్య చిచ్చుపెడుతున్నారంటూ మండిపడ్డారు. ప్యాకేజీ వస్తోందంటూ నాలుగేళ్లుగా డప్పు కొట్టి.. ఇప్పుడేమో హఠాత్తుగా ప్రత్యేక హోదా కావాల్సిందేనని చెప్పడం చంద్రబాబుకే చెల్లిందన్నారు.
గతంలో బీజేపీతో కాపురం పెద్ద తప్పిదమన్న చంద్రబాబు.. మళ్లీ వాళ్ల కాళ్లు పట్టుకొని నాలుగేళ్ల పాటు కాపురం చేసి అందినకాడికి దోచుకున్నారని దుయ్యబట్టారు. ఎప్పటికప్పుడు యూ టర్న్‌లు తీసుకుంటూ.. తనను కాపాడాలని ప్రజల్ని వేడుకోవడం కూడా చంద్రబాబుకే సొంతమని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని అవమానిస్తున్నారని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారంటూ ఈమధ్య చంద్రబాబు ఎడాపెడా నీతులు వల్లె వేస్తున్నారని.. మరి కాపు జాతిపై పెట్టిన తప్పుడు కేసుల మాట ఏమిటని ప్రశ్నించారు. వేరే పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలను టీడీపీలోకి లాక్కొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు రాజ్యాంగం గుర్తుకు రాలేదా అని నిలదీశారు.
Comments
Please login to add a commentAdd a comment