
లక్నో: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీలో చెలరేగిన సంక్షోభం ఇంకా ముగియలేదు. పార్టీ వ్యవస్థాపకుడైన తన తండ్రి ములాయం సింగ్‌కు అఖిలేశ్ యాదవ్ మరోసారి ఝలక్ ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ జాతీయ కార్యవర్గ కమిటీ నుంచి ములాయం, ఆయన సోదరుడు శివపాల్ యాదవ్‌ను తొలగించారు. వీరికి ఎటువంటి పదవులు కేటాయించ లేదని ఎన్నికల సంఘానికి సమర్పించిన పార్టీ జాతీయ ఆఫీస్ బేరర్స్ లిస్టులో పేర్కొంది. అఖిలేశ్‌తో ఎటువంటి విభేదాలు లేవని, తాను కొత్త పార్టీ పెట్టడం లేదని ములాయం ప్రకటించిన కొద్దిరోజులకే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం.
అయితే సమాజ్‌వాదీ పార్టీ సంరక్షుడిగా(పాట్రాన్) ములాయంను కొనసాగిస్తారా, లేదా అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతోంది. అయితే పార్టీలో అలాంటి పదవి ఏదీలేదని అధికార ప్రతినిధి రాజేంద్ర చౌధురి తెలిపారు. 'ఇలాంటి పదవి కోసం పార్టీ రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదు. ములాయం పార్టీ సంరక్షుడి పదవిలో ఉన్నారో, లేదో నాకు తెలియద'ని ఆయన పేర్కొన్నారు. కొడుకుతో విభేదాల కారణంగా పార్టీ అధ్యక్ష పదవిని ములాయం కోల్పోయారు. జనవరి 1 అత్యవసరంగా నిర్వహించిన పార్టీ జాతీయ సమావేశంలో అఖిలేశ్ అధ్యక్ష పదవిని దక్కించుకున్నారు. తన తండ్రికి నామమాత్రమైన సంరక్షుడి పదవిని కట్టబెట్టారు. తాజా పరిణామంపై ములాయం ఎలా స్పందిస్తారో చూడాలి.