
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక ప్రభుత్వంలో సంక్షోభానికి తమ పార్టీ కారణం కాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు స్పష్టం చేశారు. అయితే కర్ణాటకలోని రాజకీయ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు చెప్పారు. అవసరమైన సందర్భంలో సరైన నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆదివారం ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాల్ని ప్రస్తావించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ నిర్ణయాలే కర్ణాటకలో సంక్షోభానికి కారణమని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి సరైన నాయకత్వం లేదని అన్నారు. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల రాజీనామాతో కర్ణాటకలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడిందని వ్యాఖ్యానించారు. దీనిపై తర్వలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్టు తెలిపారు. గవర్నర్, కోర్టు అన్ని విషయాలు గమనిస్తున్నాయని అన్నారు.
అంతర్గత కుమ్ములాటలు, బ్లాక్‌మెయిల్ రాజకీయాలతో సాగే ప్రభుత్వం ఎక్కువకాలం కొనసాగదని ముందే చెప్పానని అన్నారు. అవకాశవాదంతో రాత్రికి రాత్రే కాంగ్రెస్, జేడీఎస్‌లు కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయని విమర్శించారు. ఈ అవకాశవాద పొత్తును ప్రజలు తిరస్కరించారని తెలిపారు. వీలైనంత త్వరగా కర్ణాటక సంక్షోభం ముగించాలని కోరుకుంటున్నామని చెప్పారు. కొత్త ప్రభుత్వం ఏర్పడి ప్రజలు ఆశలను, ఆకాంక్షలను నెరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కర్ణాటకలో మధ్యంతర ఎన్నికలు వచ్చే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment