
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముస్లింలు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చిరస్థాయిగా గుర్తుపెట్టుకుంటారని మజ్లిస్ పార్టీ శాసనసభా పక్ష నేత అక్బరుద్దీన్ ఒవైసీ అన్నారు. ఆయనను ముస్లిం దోస్త్, ఉర్దూ దోస్త్‌గా వారు పరిగణిస్తారని పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలో మైనారిటీల రిజర్వేషన్ అంశంపై స్వల్పకాలిక చర్చ నేపథ్యంలో ముస్లింలకు ముఖ్యమంత్రి వరాల జల్లు కురిపించిన అనంతరం అక్బరుద్దీన్ మాట్లాడారు. కేసీఆర్ వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఆయనకు ముఖ్యమంత్రి పోస్టు చాలా చిన్నదన్నారు.
భవిష్యత్తులో ఎందరు ముఖ్యమంత్రులు మారినా, తెలంగాణ సాధించిన వ్యక్తిగా, ముస్లింల సంక్షేమానికి పాటుపడ్డ తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ఆయన పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందన్నారు. పనిలోపనిగా నిజాం ఆభరణాలను ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు తెప్పించాలని, నిజాం వారసులు వాటి సంరక్షణ కోసం కింగ్‌కోఠి ప్యాలెస్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. దీనికి సీఎం స్పందిస్తూ, సమైక్య రాష్ట్రంలో నిజాం వారసులకు అవమానం జరిగిందన్నారు. నిజాం నగలను హైదరాబాద్‌కు శాశ్వతంగా రప్పించేలా గట్టిగా ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు.
జెరూసలేం వెళ్లే భక్తులకూ చేయూత
కాగా, హజ్ యాత్రికుల తరహాలో జెరూసలేం వెళ్లే భక్తులకు చేయూతనివ్వాలన్న టీఆర్‌ఎస్ సభ్యుడు బాబూమోహన్ వినతికి సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఖర్చులో కొంతమొత్తం ప్రభుత్వం భరించేలా, కుదిరితే ఈ క్రిస్మస్ నుంచే అమలుకు యత్నిస్తామని హామీ ఇచ్చారు. పాస్టర్లతో ట్రస్ట్ ఏర్పడితే వారి వేతనాల చెల్లింపు అంశాన్ని కూడా పరిశీలిస్తానని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment