ముజఫర్‌పూర్: ప్రతిపక్ష పార్టీలు తొలుత ‘ప్రధాని ఎవరవుతారు?’ అనే ఆట ఆడాయనీ, నాలుగో దశ ఎన్నికల తర్వాత వారు దాగుడుమూతల ఆట ఆడుకుంటున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. అవినీతిని, నల్లధనాన్ని అరికట్టలేని బలహీనమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ప్రతిపక్షం పనిచేస్తోందని మోదీ అన్నారు. బిహార్‌లోని ముజఫర్‌పూర్, యూపీలోని బారాబంకిలో మోదీ మంగళవారం ప్రచారంలో పాల్గొన్నారు. ప్రతిపక్ష హోదా పొందడానికి అవసరమైనన్ని సీట్లలో కూడా పోటీ చేయని పార్టీలు సైతం తమ వాడు ప్రధాని కావాలని కోరుకుంటున్నాయని మోదీ ఎగతాళి చేశారు. జైలులో ఉన్నవారు లేదా జైలుకు వెళ్లబోయేవారు ఢిల్లీలో బలమైన ప్రభుత్వాన్ని సహించలేరని మోదీ పేర్కొన్నారు.
అందుకే వారికి బలహీన, వదులుగా ముడివేయబడిన, నిస్సహాయ, తాము చెప్పినట్లు చేసే ప్రభుత్వం కావాలని మోదీ దుయ్యబట్టారు. నల్లధనం, అవినీతికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వ చర్యలు కొనసాగుతాయన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపైనే మోదీ విమర్శలు చేసినప్పటికీ ఆయన పేరును ఎక్కడా ఉపయోగించలేదు. అలాగే ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై మోదీ పరోక్ష వ్యాఖ్యలు చేస్తూ ఐఆర్‌సీటీసీ హోటళ్ల కుంభకోణాన్ని ప్రస్తావించారు. ఈ కేసులో లాలూ భార్య, కొడుకు, కూతురు నిందితులుగా ఉండటం తెలిసిందే. విపక్ష కూటమికి ఓటేస్తే బిహార్‌లో మళ్లీ సంఘ విద్రోహులు పెరిగిపోతారనీ, సరైన శాంతిభద్రతలు ఉండవని మోదీ ప్రజలను హెచ్చరించారు.
ప్రతిపక్షం కేంద్రంలో అధికారంలోకి రావడానికి కాకుండా, కేవలం పార్లమెంటులో తమ ఎంపీల సంఖ్యను పెంచుకోడానికి మాత్రమే ప్రస్తుతం ఎన్నికల్లో పోరాడుతోందని అన్నారు. పార్లమెంటులో ప్రతిపక్ష హోదా కూడా లేని కాంగ్రెస్, చిన్న పార్టీలు తమ కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తాయేమోనని వణికిపోతోందన్నారు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను తీసుకొచ్చామనీ, ప్రతిపక్షాలు వ్యతిరేకించినా ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ బద్ధత కల్పించామనీ, ఆ కమిషన్‌కు తొలి చైర్మన్‌గా ముజఫర్‌పూర్‌కే చెందిన వ్యక్తిని నియమించామని చెప్పారు. నాలుగోదశ ఎన్నికలు ముగిసిన అనంతరం ప్రతిపక్షనేతలకు కంటిమీద కునుకు లేకుండా పోతోందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment