సాక్షి, అమరావతి బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ప్రజల దృష్టిని ఆకర్షిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. ఇక్కడి నుంచి సీఎం చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ పోటీ చేస్తుండడంతో అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై కేంద్రీకృతమైంది. అయితే తొలిసారిగా ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తుండడం.. బలమైన ప్రత్యర్థి బరిలో ఉండడంతో ఈ ఎన్నికల్లో లోకేశ్ గెలుపుపై సందేహాలు నెలకొన్నాయి. దీనికితోడు ప్రచారంలో తానుగా చేస్తున్న కామెడీతో లోకేశ్ అభాసుపాలవుతున్నారు. ఇప్పటికే ఓటింగ్, కౌంటింగ్ ప్రక్రియలపై నోరు జారడంతో సామాజిక మాధ్యమాలలో తీవ్రంగా ట్రోలింగ్‌కు గురయ్యారు. అదే సమయంలో ఆయన ప్రచారానికి ప్రజల నుంచి స్పందన కరువైంది.
వైఎస్సార్‌సీపీ వైపే బీసీల మొగ్గు
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌తో రాష్ట్రవ్యాప్తంగా బీసీలు ఆ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు. దీనికితోడు మంగళగిరిలో స్థానికంగా బలంగా ఉన్న బీసీలు తమకు టికెట్ కేటాయిస్తామని హామీ ఇచ్చిన టీడీపీ నాయకత్వం చివరకు మొండిచేయి చూపి అధినేత తనయుడికి సీటివ్వడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ఈ నేపథ్యంలో బీసీ సంక్షేమ సంఘం శుక్రవారం మంగళగిరిలో సమావేశమై తమ భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఇదే సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) మాట్లాడుతూ 2024లో మంగళగిరి స్థానాన్ని బీసీలకే కేటాయిస్తామని, ఈ మేరకు తమ పార్టీ అధినేతను తాను ఒప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో అక్కడున్న బీసీ సంఘాల నేతలంతా వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలపడంతోపాటు ఆర్కేకు ఓటు వేసి గెలిపించాలని బీసీలకు పిలుపునిచ్చారు.
లోకేశ్‌కు ఝలక్ తప్పదంటున్న బీసీలు
ఇదిలా ఉంటే.. నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ తరచూ కుప్పం గురించి ప్రస్తావిస్తూ, తన తండ్రిని నాలుగు దశాబ్దాలుగా కుప్పం ప్రజలు ఆదరించి, విజయాన్ని అందిస్తున్నారని, తాను గెలిస్తే మంగళగిరిని కుప్పంలా అభివృద్ధి చేస్తానని చెబుతున్నారు. ఈ మాట బీసీలంతా పునరాలోచనలో పడేలా చేసింది. ఈ ఎన్నికల్లో లోకేశ్ గెలుపునకు సహకరిస్తే ఆయన ఇక్కడే పాతుకుపోతారని, భవిష్యత్తులో తమకు అవకాశమే లేకుండా పోతుందన్న భావనకు వారు వచ్చారు.
ఇప్పటికే మంగళగిరి టికెట్‌ను బీసీలకే కేటాయిస్తామని చివరిదాకా చెప్పిన అధిష్టానం.. ఆఖరు నిమిషంలో లోకేశ్‌ను బరిలోకి దింపడం ద్వారా తమను నమ్మించి మోసం చేసిందని, ఈ పరిస్థితుల్లో లోకేశ్ గెలవకుండా చేసి తమ తడాఖా చూపాలని వారు నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. నియోజకవర్గంలో దాదాపు రెండున్నర లక్షలకుపైగా ఓటర్లు ఉండగా.. ఇందులో బీసీలు 70 వేల వరకు ఉన్నారు. వీరంతా ఏకతాటిపై నిలచి లోకేశ్‌కు మొండిచెయ్యి చూపేందుకు సిద్ధమవుతున్నారు.
డబ్బుల కట్టలతో గెలవాలని ప్రయత్నం..
నారా లోకేశ్ ఎన్నికల ప్రచారానికి నియోజకవర్గంలో ఆశించిన స్థాయిలో ప్రజల నుంచి స్పందన రాకపోవడంతో డబ్బులిచ్చి జనాన్ని తరలిస్తున్నారు. ఏదేమైనా లోకేశ్‌ను గెలిపించాలనే కృతనిశ్చయంతో ఉన్న ప్రభుత్వ పెద్దలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలో అధికార దుర్వినియోగానికి పాల్పడేందుకు వెనుకాడట్లేదు.
ఇందులో భాగంగా భారీ ఎత్తున డబ్బులు దింపేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం తనయుడు కావడంతో డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. శుక్రవారం జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓట్లకోసం ఒక్కో ఓటుకు రూ.4 వేల చొప్పున డబ్బులు పంచడం ఇందుకు నిదర్శనం. అన్ని వర్గాల మద్దతుతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఆర్కే ప్రచారంలో దూసుకుపోతుండడంతో ఆయన్ను నిలువరించేందుకు నానా తంటాలు పడుతున్న టీడీపీ నేతలు భారీ మొత్తంలో డబ్బు దించయినా గెలవాలని గట్టి పన్నాగంలో ఉన్నట్టు కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment