![Narendra Modi foregrounds Article 370 at Parli - Sakshi](/styles/webp/s3/article_images/2019/10/18/mod.jpg.webp?itok=kfKVJnCZ)
సతారా ర్యాలీలో కరవాలంతో ప్రధాని మోదీ
బీడ్: జమ్మూకశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని హేళన చేస్తున్న వారిని చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తులకు శిక్షించే సదవకాశం ఇప్పుడు మహారాష్ట్ర ప్రజలకు వచ్చిందన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం పుణే, సతారా, పర్లిల్లో జరిగిన బహిరంగసభల్లో ప్రధాని పాల్గొన్నారు.
బీజేపీ కార్యశక్తికి, కాంగ్రెస్–ఎన్సీపీల స్వార్థశక్తికి మధ్య పోరాటంగా ఈ ఎన్నికలను మోదీ అభివర్ణించారు. గత ఐదేళ్లలో భారత్‌లో పెట్టుబడులు ఐదు రెట్లు పెరిగాయని చెప్పారు. ‘గత 70 ఏళ్లుగా ఆర్టికల్ 370 గురించి అంతా మాట్లాడుతూనే ఉన్నారు. అందరూ దాన్ని రద్దు చేయాలనే అన్నారు. కానీ ఎవరూ ఆ ధైర్యం చేయలేదు. మేం చేశాం. యథాతథ స్థితిని మార్చాలనుకున్నప్పుడు వ్యతిరేకతలు, నిరసనలు ఉంటాయి. వాటికి మేం భయపడలేదు. 21వ శతాబ్దపు భారత్ మార్పులకు భయపడదు’ అని స్పష్టం చేశారు.
ఈ ఎన్నికల్లో బీజేపీ కూటమి గత విజయాల రికార్డులను తిరగరాస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.‘మీ దేశభక్తిపై నాకు నమ్మకముంది. ఆర్టికల్ 370కి సంబంధించి దేశ ప్రయోజనాలను దెబ్బతీసేలా మాట్లాడుతున్న వారికి మీరు గుణపాఠం చెప్తారని నాకు తెలుసు’ అన్నారు. దేశ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ పార్టీ ఆక్సిజన్‌ను అందిస్తోందన్నారు. ‘దేశ సమగ్రత విషయంలోనూ మీరు హిందూ, ముస్లిం అనే అలోచిస్తారా? ఇది సమంజసమేనా?’ అని మోదీ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment