
సాక్షి, హైదరాబాద్: దేశంలో అన్ని వర్గాల ప్రజలకు ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం ద్వారా లబ్ధి చేకూరిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాం మాధవ్ పేర్కొన్నారు. దేశ ప్రజలు మళ్లీ మోదీ ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నారన్నారు. గత ఐదేళ్లలో దేశాన్ని ‘ఉగ్రవాదరహిత దేశం’గా మార్చారన్నారు. ‘ఫోరం ఫర్ న్యూథింకర్స్’ ఆధ్వర్యంలో ఆది వారం హైదరాబాద్‌లో ‘మరోసారి మోదీ రావాలి’ అంశంపై నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. మోదీ కాకుండా మరో ప్రభుత్వం వస్తే పేదలకు మళ్లీ ఇబ్బందులు తప్పవన్నారు. 2022 నాటికి 75ఏళ్లు పూర్తి చేసుకోనున్న స్వతంత్ర భారతంలో ఇంకా ఆకలి చావులు ఉండకూడదనుకుంటే మళ్లీ మోదీయే ప్రధాని కావాలన్నారు. ఆయనే దేశాన్ని ‘నవభారతం’గా మారుస్తున్నారని పేర్కొన్నారు. మోదీ నేతృత్వంలో 2020కి ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ మారుతుందన్నారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీకి 338 సీట్లు వస్తాయని, తమ పార్టీనే అధికారంలోకి వస్తుందన్నారు. తాము మీడియాను మీడియాలాగే చూస్తున్నామన్నారు. తమ పార్టీకి సొంత మీడియా వస్తుందని అప్పటివరకు నమో యాప్‌ను వాడాలని సూచించారు. మోదీ ప్రభుత్వం ఏపీకి సంబంధించి 80% హామీలను నెరవేర్చిందన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ మోదీ పాలనలో ప్రజలకు మంచి రోజులు వచ్చాయన్నారు. పంటలకు మద్దతు ధర పెంచడమే కాకుండా ఫసల్ బీమా యోజన వంటి పథకాలతో వ్యవసాయరంగానికి లబ్ధిచేకూర్చారన్నారు. ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు జీఎస్‌టీ ఫలాలు ప్రజలకు అందుతున్నాయన్నారు. ఆర్థికంగా వెను కబడిన బీసీ, ఎస్సీ, ఎస్టీయేతరులకు 10% రిజర్వేషన్లు కల్పించిన ఘనతా మోదీదేనన్నారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో మోదీ ప్రజల కోసం పనిచేస్తున్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్ రాంచంద్రరావు తదితరులు మాట్లాడారు.
Comments
Please login to add a commentAdd a comment