సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది! కేంద్రంలోని మోదీ సర్కారు ముందస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచన చేస్తోందన్న సమాచారంతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నారు. నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉందంటూ పార్టీ ముఖ్యులను ఇప్పటికే అప్రమత్తం చేసినట్లు తెలిసింది. ‘‘ఈ ఏడాది నవంబర్‌లోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కేంద్రం ముందస్తు ఎన్నికలకు వెళ్తే అనివార్యంగా మనమూ వెళ్లక తప్పదు. బడ్జెట్ సమావేశాల తర్వాత పూర్తిగా నియోజకవర్గాలపైనే దృష్టి పెట్టండి. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొందాం. వివిధ సర్వేల్లో మనకు అంతా అనుకూలంగానే ఫలితం వస్తోంది. అక్కడక్కడా చిన్న చిన్న లోపాలున్నా ఈలోగా సర్దుకుందాం. నవంబర్‌లో ఎన్నికలు జరుగుతాయన్న స్పృహతోనే ఉండాలి.
అంతా అప్రమత్తంగా పనిచేయాలి..’’ అని సీఎం కేసీఆర్ పార్టీ నేతలకు చెబుతున్నట్లు టీఆర్‌ఎస్‌లోని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, అమలు చేస్తున్న కార్యక్రమాలు, కులాలు, వర్గాల వారీగా ప్రకటిస్తున్న వరాలు, పార్టీలోకి జరుగుతున్న చేరికలు వంటి అంశాలన్నీ ముందస్తు ఎన్నికల సంకేతాలను చూపుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వివిధ సర్వేల ద్వారా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీల పనితీరు, రాజకీయ పరిస్థితులపై ఓ అంచనాకు వచ్చిన కేసీఆర్.. అవసరమైన చోట మరమ్మతులు చేస్తున్నారని అంటున్నారు.
ఇందులో భాగంగానే ఆయా నియోజకవర్గాల్లో వివిధ పార్టీల నుంచి ముఖ్యులు అనుకున్న నేతలను పార్టీలోకి ఆహ్వానించే ప్రక్రియ వేగం పుంజుకుందని, ఇదంతా ముందస్తు కసరత్తులో భాగమేనని చెబుతున్నారు. ఈ నెల 15న నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్రంలోని బీజేపీ ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నారు. ఆ రోజు బీజేపీ తన వైఖరిని ఖరారు చేస్తుందన్న సమాచారం ఉన్నట్టు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొంటున్నాయి. తెలంగాణలో వచ్చే ఏడాది జూన్ 2వ తేదీతో శాసన సభ కాల పరిమితి పూర్తవుతోంది.
ఈ ఏడాది 5.. వచ్చే ఏడాది 8
దేశవ్యాప్తంగా ఈ ఏడాది ఐదు, వచ్చే ఏడాది జూన్ కల్లా ఎనిమిది రాష్ట్రాలు కలుపుకొని మొత్తంగా 13 రాష్ట్రాలకు ఎన్నికలు జరగాల్సి ఉంది. లోక్‌సభ కాల పరిమితి కూడా వచ్చే ఏడాది జూన్ 3తో ముగియనుండటంతో ఏప్రిల్–మే మధ్య ఎన్నికలు జరపాలి. మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర, కర్ణాటకలకు ఈ ఏడాది మేలో నిర్ణీత గడువులోగానే ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయని చెబుతున్నారు. మిజోరాంలో ఈ ఏడాది నవంబర్‌లోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వచ్చే ఏడాది జనవరిలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల అసెంబ్లీ కాల పరిమితి ముగియనుంది. వీటికి ఈ ఏడాది డిసెంబర్–వచ్చే ఏడాది జనవరిలోగా ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. దీంతో వీటి ఎన్నికలను ముందుకు జరిపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
మరోవైపు సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్ రాష్ట్రాలకు వచ్చే ఏడాది ఏప్రిల్–మే నెలల మధ్య, తెలంగాణ, ఏపీ, ఒడిశా రాష్ట్రాలకు వచ్చే ఏడాది మే–జూన్ మధ్య ఎన్నికలు పూర్తి చేయాల్సి ఉంది. ఈ ఎనిమిది రాష్ట్రాలకు ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. జూన్ 3తో కాలపరిమితి ముగియనున్నందున లోక్‌సభకు కూడా ఆర్నెళ్ల ముందుగా ఎన్నికలు జరిగితే ఈ రాష్ట్రాలు కూడా ఎన్నికలకు వెళ్లడం అనివార్యమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ అంశాలన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. లోక్‌సభతోపాటే శాసన సభ ఎన్నికలకు వెళ్లక తప్పదని టీఆర్‌ఎస్ అధినేత ఓ అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పార్టీ ముఖ్య నేతలు, ఎంపీలు, కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వద్ద ఈ అంశాన్ని ఇటీవల ప్రస్తావిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment