చండీగఢ్ : పంజాబ్ మంత్రి, కాంగ్రెస్ నేత నవజోత్ సింగ్ సిద్దూ ఎన్నికల ప్రచారం సందర్భంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లోని కతిహార్‌లో మంగళవారం ఎన్నికల ప్రచార ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లింలంతా ప్రధాని నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా ఏకమై కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ముస్లింలంతా ఒక్కటై కాంగ్రెస్ అభ్యర్ధి తారిఖ్ అన్వర్‌ను గెలిపించుకోవాలని పిలుపు ఇచ్చారు.
ముస్లిం సోదరులు ప్రస్తుతం జరుగుతున్న కుట్రను అర్ధం చేసుకోవాలని, జనాభాలో 54 శాతం ఉన్న మీరు పంజాబ్‌లో పనులు చేసుకునేందుకు అక్కడికి వెళుతుంటారని, మీకు పంజాబ్‌లో ఎలాంటి సమస్యలున్నా మీకు సిద్ధూ అండగా ఉంటాడని చెప్పుకొచ్చారు. ఓవైసీ వంటి అభ్యర్ధులను పోటీకి నిలపడం ద్వారా ముస్లిం ఓట్లలో చీలిక ద్వారా గెలిచేందుకు బీజేపీ పన్నుతున్న కుట్రను గమనించాలని కోరారు.
ఎన్నికల్లో సిక్స్‌ను బాది మోదీని బౌండరీ వెలుపలకు నెట్టివేయాలని మాజీ క్రికెటర్ సిద్ధూ పిలుపు ఇచ్చారు. మీరంతా ఏకమైతే మీ అభ్యర్ధి (తారిఖ్ అన్వర్) గెలుపును ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. కాగా ద్వేషపూరిత ప్రసంగాలు చేసిన మాయావతి, యోగి ఆదిత్యానాధ్ సహా పలువురు నేతలపై ఈసీ చర్యలు చేపట్టిన నేపథ్యంలో సిద్దూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment