
ప్రజలు తమ ఓటుతో నల్ల ఆంగ్లేయులను ఓడించి దేశాన్ని కాపాడాలి
భోపాల్ : సార్వత్రిక ఎన్నికల సమరం ముగింపు దశకు చేరుకున్న వేళ పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులంతా వ్యక్తిగత విమర్శలకు దిగుతున్న సంగతి తెలిసిందే. ప్రత్యర్థి పార్టీ నాయకులే లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ప్రజాప్రతినిధుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇలాంటి వ్యాఖ్యలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధు మరోసారి తనదైన శైలిలో ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు ఎక్కుపెట్టారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ప్రచారం చేసేందుకు సిద్ధు మధ్యప్రదేశ్‌లో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో సిద్ధు మాట్లాడుతూ.. ‘ కొత్త పెళ్లి కూతురు రొట్టెలు చేసే శబ్దం కంటే ఆమె గాజుల శబ్దమే ఎక్కువగా వినిపిస్తుంది. ఈ కారణంగా కొత్త కోడలు పనిమంతురాలే అని ఇరుగుపొరుగు వాళ్లు అనుకుంటారు. మోదీజీ కూడా అలాంటి కొత్త పెళ్లి కూతురు లాంటి వారే. ఆయన ప్రభుత్వం కూడా తక్కువ పనిచేస్తుంది. కానీ ఎక్కువ శబ్దం చేస్తుంది’ అని నరేంద్ర మోదీని, బీజేపీని తీవ్రస్థాయిలో విమర్శించారు. మోదీ అబద్ధాలు వ్యాప్తి చేసే వారికి సారథి అని, అంబానీ-అదానీ వంటి వ్యాపారవేత్తలకు బిజినెస్ మేనేజర్ అంటూ మండిపడ్డారు.
నల్ల ఆంగ్లేయులను తరిమికొట్టండి
‘ఈ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ. మౌలానా ఆజాద్, మహాత్మా గాంధీల నాయకత్వంలో పనిచేసిన పార్టీ ఇది. శ్వేత జాతీయులైన బ్రిటిషర్ల నుంచి వాళ్లు మనకు స్వేచ్ఛను ప్రసాదించారు. అదే విధంగా ఇండోర్ ప్రజలు తమ ఓటుతో నల్ల ఆంగ్లేయుల(బీజేపీ నేతలను ఉద్దేశించి)ను ఓడించి దేశాన్ని కాపాడాలి’ అని సిద్ధు విఙ్ఞప్తి చేశారు. కాగా శుక్రవారం కూడా ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతర వ్యాఖ్యలు చేసినందుకు గానూ ఈసీ సిద్ధుకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. గత నెలలో కూడా ఆయన పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో 72 గంటల పాటు ప్రచారం చేయకుండా ఈసీ నిషేధం విధించింది.
Punjab Minister & Congress leader Navjot Singh Sidhu in Indore, MP: I call him Liar-in-Chief, Divider-in-Chief and Business Manager of Ambani and Adani. https://t.co/JLDwq1Bms3
— ANI (@ANI) May 11, 2019