సాక్షి, న్యూఢిల్లీ : మాజీ క్రికెటర్, కాంగ్రెస్ ఎమ్మెల్యే నవ్‌జోత్ సింగ్ సిద్ధూకి పార్టీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు తెలుస్తోంది. ఆయనను ఢిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) అధ్యక్షుడిగా నియమించబోతున్నట్లు సమాచారం. సిద్ధూ ఇటీవల పంజాబ్ మంత్రివర్గం నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో విభేదాలు, మంత్రివర్గంలో కీలక శాఖల నుంచి తప్పించడం వంటి పరిణామాల నేపథ్యంలో సిద్ధూ రాజీనామా చేశారు. ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా మాత్రమే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో సిద్ధూకి ఢిల్లీ పగ్గాలు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం.
ఇటీవల ఢిల్లీ కాంగ్రెస్ కీలక నేత, మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఓ పెద్ద దిక్కును కోల్పోయినట్లైంది. ప్రస్తుతం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని ముందుకు నడిపించే సత్తా ఉన్న నాయకులు కూడా ఎవరూ లేరు. ఈ నేపథ్యంలో సిద్ధూకు ఢిల్లీ పగ్గాలు అప్పగించి ఎన్నికలకు వెళ్లాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సిద్ధూకి గాంధీ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.
ఢిల్లీ కాంగ్రెస్ నేతలతో కూడా సిద్ధూకి మంచి సంబంధాలే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిద్ధూని డీపీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే పార్టీకి లాభం చేకూరుతుందని అధిష్టానం భావిస్తోంది. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక అనంతరం సిద్ధూ డీపీసీసీ బాధ్యతలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ విషయాన్ని ఢిల్లీ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ పీసీ చాకో కొట్టిపాడేశారు. డీపీసీసీ అధ్యక్షుడిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ‘ డీపీసీసీ అధ్యక్షుడి పగ్గాలు సిద్దూ చేపట్టబోతున్నారనేది అవాస్తవం. ఈ విషయం నా దృష్టికి రాలేదు. దీనిపై పార్టీలో ఎలాంటి చర్చ జరగలేదు. అవన్నీ పుకార్లు మాత్రమే’ అని చాకో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment