డొనాల్డ్ ట్రంప్ (ఫైల్ ఫొటో)
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుడు నిర్ణయాల వైపు మొగ్గు చూపుతూ ఉంటే పాలనా యంత్రాంగంలో భాగమైన తాము అతని చర్యల్ని అడ్డుకోవడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నామంటూ పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఒక వ్యక్తి న్యూయార్క్ టైమ్స్ పత్రికకి రాసిన వ్యాసం ఇప్పుడు కలకలం రేపుతోంది. ఆ వ్యాసం రాసిన వ్యక్తిని న్యూయార్క్ టైమ్స్ పరిపాలనా అధికారి అని మాత్రమే పేర్కొంది. ఆ అధికారి ఎవరు, పురుషుడా ? మహిళా ? లాంటి వివరాలు కూడా పత్రిక బయటపెట్టలేదు. వైట్ హౌస్ లోపలా, బయటా ఇప్పుడు ఆ అజ్ఞాత వ్యక్తి ఎవరన్నదానిపైనే చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ వ్యాసంపై ట్రంప్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆ వ్యక్తి రాజద్రోహానికి పాల్పడ్డాడంటూ నిప్పులు చెరిగారు. ‘ఆ వ్యక్తి ఒక పిరికిపంద. అందుకే పేరు చెప్పకుండా వ్యాసం రాశారు. ఆ వ్యక్తి తనంతట తానుగా బయటపడకపోతే దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని న్యూయార్క్ టైమ్స్ పత్రిక ఆ ఆకాశరామన్నని వెలుగులోకి తీసుకురావాలి‘ అని ట్రంప్ ట్వీట్ చేశారు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కూడా ఆ వ్యాసం రాసిన వ్యక్తి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
ఎవరు రాశారు ?
ట్రంప్‌ని టార్గెట్ చేస్తూ ఆ వ్యాసం ఎవరు రాసి ఉంటారా అన్నదే ఇప్పడు అమెరికాలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఆ వ్యాసం వైరల్ అవుతోంది. ఆ రచనా శైలిని ఆధారంగా చేసుకొని ఎవరు రాసి ఉంటారా అని ఎవరికి వారు తమ ఊహలకు పదును పెడుతున్నారు. చాలా మంది పేర్లను తెరపైకి తీసుకువస్తున్నారు. ఇంటర్నెట్‌లో ఆ వ్యాస రచయితపై జోరుగా బెట్టింగ్‌లు కూడా జరుగుతున్నాయి. వందల డాలర్లను బెట్టింగ్‌లో పెడుతున్నారు. ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్‌పైనే ఎక్కువ మంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆ తర్వాత స్థానం అమెరికా విద్యాశాఖ మంత్రి బెట్సీ డెవస్‌దే. ఇక విదేశాంగ మంత్రి మైక్‌పాంపే, ఆర్థిక మంత్రి స్టీవెన్ ముంచిన్, వైట్‌హౌస్ ప్రధాన అధికారి జాన్ కెల్లీలపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారిపై కూడా బెట్టింగ్‌లు నడుస్తున్నాయి. అయితే వాళ్లంతా ఆ వ్యాసంతో తమకు సంబంధం లేదంటూ కొట్టి పారేశారు.
ఆ వ్యాసంలో ఏముంది ?
న్యూయార్క్ టైమ్స్ సంపాదకీయ పేజీలో రాసిన ఆ వ్యాసం ట్రంప్ వ్యక్తిగత ప్రవర్తనను లక్ష్యంగా చేసుకొని సాగింది. ఆయన మానసిక స్థితి ఎంత అధ్వాన్నంగా ఉందో బయటపెట్టే ప్రయత్నం జరిగింది. ‘ట్రంప్ ఎప్పుడూ అసహనంతో రగిలిపోతూ ఉంటారు. ఆ స్థితిలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వాటిని అడ్డుకోవడమే మా ముందున్న కర్తవ్యం. ట్రంప్ పాలనా యంత్రాంగంలో ప్రతీ ఒక్క అధికారి అత్యంత జాగురూకతతో వ్యవహరిస్తున్నారు‘ అని ఆ వ్యాసంలో పేర్కొన్నారు. అయితే ట్రంప్ విధానపరమైన నిర్ణయాలైన పన్నుల కోత, మిలటరీ బడ్జెట్ పెంపు వంటి చర్యల్ని ఆ వ్యాసంలో సమర్థించారు.
రాజకీయంగా తమకు అధ్యక్షుడితో విభేదాలు లేవని, ట్రంప్ వ్యక్తిగత ప్రవర్తనతోనే పేచీలొస్తున్నాయని పేర్కొన్నారు. ట్రంప్‌ని నీతిబాహ్యమైన వ్యక్తి, అప్రజాస్వామికుడని దుయ్యబట్టారు. ట్రంప్‌కి నాయకత్వ లక్షణాలు లేనేలేవని.. అనాలోచితంగా, అసమర్థుడిగా, ఎప్పుడూ వ్యతిరేక భావనలతో ఉంటారంటూ ఆ వ్యాసంలో రాసుకొచ్చారు. పేరు లేకుండా వ్యాసాన్ని ప్రచురించడం న్యూయార్క్ టైమ్స్ చాలా అరుదుగా చేస్తుంది. ఆ వ్యాసంపై ఇంత రచ్చ జరుగుతున్నా ఆ పత్రిక వ్యాసం ఎవరు రాశారో బయటపెట్టడానికి అంగీకరించడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment