సాక్షి, విశాఖపట్నం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై విశాఖ విమానాశ్రయంలో హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు శ్రీనివాసరావును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అధికారులు రహస్యప్రాంతానికి తరలించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. హైకోర్టు ఆదేశాలతో వైఎస్ జగన్‌పై దాడి కేసు దర్యాప్తును చేపట్టిన ఎన్‌ఐఏ.. నిందితుడిని కస్టడీలోకి తీసుకుని విచారణను ముమ్మరం చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆదివారం నిందితుడి తరపు లాయర్ అబ్దుల్ సలీమ్‌ను విశాఖబక్కన్నపాలెం సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్‌కు రావాలని సూచించారు. అయితే ఇక్కడ అధికారులు ఎలాంటి విచారణ జరపలేదని న్యాయవాది సలీమ్ మీడియాకు తెలిపారు. శ్రీనివాసరావును విచారించేందుకు బక్కన్నపాలెంలోని సీఆర్పీఎఫ్ ట్రైనింగ్ సెంటర్ సరైన ప్రాంతం కాదని అధికారులు భావిస్తున్నట్లు చెప్పారు. అందువల్ల నిందితుడిని విచారణ కోసం మరో ప్రాంతానికి తరలించడానికి ఉన్నతాధికారుల అనుమతిని కోరారని పేర్కొన్నారు. అనుమతులు లభించిన వెంటనే శ్రీనివాసరావును హైదరాబాద్ లేదా మరో ప్రాంతానికి తరలిస్తారని స్పష్టం చేశారు. శ్రీనివాస్ రావును హైదరాబాద్‌కు తరలించిన అధికారులు అనంతరం ఢిల్లీ లేక ముంబైకు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment