
నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : పీఎన్‌బీ భారీ కుంభకోణం నిందితులు, రుణఎగవేత దారులు నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీలను ఎలాగైనా భారత్‌కు రప్పించి తీరతామని కేంద్ర రక్షణ శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్ఘాటించారు. గురువారం ఎకనామిక్ టైమ్స్ నాలుగో వార్షికోత్సవ సదస్సులో పాల్గొన్న ఆమె ప్రసంగించారు.
‘అవినీతి రహిత పాలన అందించేందుకు ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుంది. ఇలాంటి లోపాలు ఉన్న సమయంలో వ్యవస్థ పటిష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. నీరవ్ మోదీలు, మెహుల్ చోక్సీలు ఆర్థిక నేరానికి పాల్పడ్డారు. వారు ఎంతో దూరం పారిపోలేరు. వారిని ఎలాగైనా వెనక్కి రప్పించి తీరతాం’ అని ఆమె ప్రసంగించారు. ఇక బీజేపీ ప్రభుత్వం పథకాలతో మెరుగైన సంస్కరణలకు పెద్ద పీట వేస్తోందని.. అందుకే జీఎస్టీనే మంచి ఉదాహరణ అని ఆమె పేర్కొన్నారు.
టైమ్స్ గ్రూప్ ఎండీ వినీత్ జైన్ మాట్లాడుతూ... పీఎన్‌బీ తరహా స్కామ్ జరిగిన సమయంలో ప్రత్యేక బిల్లుల ద్వారా ప్రభుత్వాలు త్వరగతిన చర్యలు తీసుకోవాలని.. అప్పుడే రుణఎగవేతదారులను కట్టడి చేయగలరని ఆయన అభిప్రాయపడ్డారు.