నరసాపురం కోడలికి కేంద్రమంత్రి పదవి | Nirmala Sitharaman Get Central Minister Post | Sakshi
Sakshi News home page

నిర్మలత్వానికి మళ్లీ పట్టం

Published Fri, May 31 2019 1:32 PM | Last Updated on Fri, May 31 2019 1:32 PM

Nirmala Sitharaman Get Central Minister Post - Sakshi

నరసాపురం:  ప్రధాని నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో నిర్మలా సీతారామన్‌కు మళ్లీ చోటుదక్కింది. ప్రధాని మోదీతోపాటుగా గురువారం రాత్రి ఆమె కేంద్రమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. దీంతో నరసాపురం కోడలికి అరుదైన గౌరవం దక్కినట్టయ్యింది. మోదీ సర్కార్‌లో 2017లో కేంద్ర రక్షణశాఖ మంత్రిగా ఆమె బాధ్యతలు తీసుకున్నారు. దేశ రక్షణశాఖను నిర్వహించిన తొలి మహిళాగా ఖ్యాతికెక్కారు. నిర్మలాసీతారామన్‌. ఆ శాఖ బాధ్యతలను ఏడాదిన్నరపాటు నిష్కళంకంగా.. సమర్థంగా నిర్వహిస్తూ మోదీ ప్రశంసలు అందుకున్నారు. ముఖ్యంగా రాఫెల్‌ కుంభకోణం అంటూ ప్రతిపక్షనేత రాహూల్‌గాంధీ తీవ్రస్థాయిలో బీజేపీ సర్కారుపై విరుచుకుపడ్డ సందర్భంలో నిర్మలాసీతారామన్‌ పార్లమెంటులో మోదీకి వెన్నుదన్నుగా తన వాణిని వినిపించారు. ఇక కాశ్మీర్‌లో పాకిస్తాన్‌ ఉగ్రవాదులు మన జవానులను మట్టుపెట్టిన తరువాత, పాకిస్తాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై దాడులు నేపథ్యంలో నిర్మలాసీతారామన్‌ పనితీరుపై ప్రశంసలు వచ్చాయి. దీనివల్లే ఆమెకు కేంద్రమంతివర్గంలో మరోమారు చోటు దక్కింది. ఈసారి కూడా కీలకమైన శాఖను ఆమెకు అప్పగించే అవకాశం ఉంది.

నరసాపురం కోడలు.. నిర్మలా సీతారామన్‌ నరసాపురం కోడలు. ఆమె 1986లో నరసాపురం పట్టణానికి చెందిన రాజకీయ నేపథ్యం గల పరకాల ప్రభాకర్‌ను పెళ్లి చేసుకున్నారు. వీరికివాగ్మయి అనే కుమార్తె ఉన్నారు. 1959లో తమిళనాడులోని మధురైలో జన్మించిన నిర్మలాసీతారామన్‌ వివాహం అనంతరం చాలాకాలం నరసాపురంలోనే నివాసం ఉన్నారు. పరకాల ప్రభాకర్‌ తండ్రి శేషావతారం నరసాపురం నియోజకవర్గం నుంచి మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఉమ్మడి ఏపీలో పలు మంత్రిత్వశాఖలు నిర్వహిం చారు. ప్రభాకర్‌ తల్లి కాళికాంబ కూడా ఒకసారి ఎమ్మెల్యేగా పనిచేశారు. 2014–19 మధ్య  మోదీ సర్కారులో మొదట ఏపీ నుంచి రాజ్యసభ సభ్యురాలిగా ప్రాతినిధ్యం వహించిన నిర్మలాసీతారామన్‌ స్వతంత్ర హోదాగల కేంద్ర వాణిజ్య పన్నులు, పరిశ్రమల శాఖను నిర్వహించారు. ఆ సమయంలోనే నరసాపురంలోని తీరగ్రామాలైన తూర్పుతాళ్లు, వేములదీవి పంచాయతీలను దత్తత తీసుకున్నారు. దాదాపు రూ.20 కోట్లతో ఈ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. తరువాత ఆమె రాజ్యసభ సభ్యత్వం కర్ణాటకకు మారింది. అనంతరం కీలకమైన దేశ రక్షణశాఖ మంత్రిగా మోదీ ఆమెకు పదోన్నతి ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement