సాక్షి, అమరావతి, విజయవాడ: టీడీపీ విజయవాడలో అట్టహాసంగా నిర్వహించిన మహానాడు రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై కనీసం చర్చ కూడా లేకుండానే ముగిసింది. అనూహ్యంగా మారిన పార్టీ రాజకీయ వైఖరి గురించి వివరించకుండా ఎంపిక చేసుకున్న అంశాలపై సుదీర్ఘ ప్రసంగాలతో మూడు రోజుల తంతును మంగళవారంతో ముగించారు. ఓవైపు సూర్య ప్రతాపం మరోవైపు నేతల ఊకదంపుడు ఉపన్యాసాలతో విసిగిపోయిన కార్యకర్తలు మధ్యాహ్నం భోజనాలు ముగియగానే తిరుగు ప్రయాణమయ్యారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించి బాలికలు, మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా కనీసం ఎలా అరికట్టాలనే అంశాన్ని కూడా మహానాడులో ప్రస్తావించలేదు. ప్రపంచంలో చంద్రబాబు అంతటి గొప్ప వ్యక్తి లేరని, లోకేష్ లాంటి వీరుడు మరొకరని చూడలేమనే రీతిలో నాయకులు పొగడ్తల వర్షం కురిపించారు. మద్దతు ధరలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులతో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదనే రీతిలో ప్రసంగాలు సాగాయి. మూడు రోజుల్లో 37 గంటలపాటు సాగిన మహానాడులో 8 నుంచి 10 గంటలు చంద్రబాబే మాట్లాడగా 106 మంది నాయకులు చెప్పిన విషయాలనే మళ్లీ మళ్లీ ప్రస్తావించారు.
వైఖరి మార్పుపై కప్పదాటు
ఎన్నికలకు ముందు పార్టీ రాజకీయ వైఖరిని ఎందుకు మార్చుకోవాల్సి వచ్చిందనే విషయంపై చంద్రబాబు సహా ముఖ్య నేతలెవరూ సరైన కారణాలను పార్టీ యంత్రాంగానికి వివరించలేదు. నాలుగేళ్ల పాటు కేంద్రంలో అధికారాన్ని పంచుకుని ప్రత్యేక హోదా వద్దంటూ ప్యాకేజీకి ఒప్పుకుని ఉన్నట్టుండి బయటకు రావటంపై శ్రేణులకు చంద్రబాబు స్పష్టత ఇవ్వలేదు. ప్రత్యేక హోదా ఉద్యమాలను అణచి వేయటంపై పశ్చాత్తాపం వ్యక్తం చేయకుండా ఇప్పుడు పోరాడాలనటాన్ని ఎలా సమర్థించుకుంటారో అధినేతకే తెలియాలి.
అంతా మోదీ, అమిత్‌షా చుట్టూనే
మహానాడు అంతా కేంద్రం, ప్రధాని మోదీ, అమిత్‌షా చుట్టూ సాగింది. మోదీపై వ్యతిరేకత పెంచడం ద్వారానే టీడీపీ ముందుకు వెళ్లగలుగుతుందని చెబుతూ పార్టీ యంత్రాంగమంతా అదే పనిలో ఉండాలని చంద్రబాబు కార్యకర్తలకు సూచించారు. తనపై వస్తున్న అవినీతి ఆరోపణలను నమ్మకుండా ఎదురుదాడి చేయాలన్నారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి వస్తేనే అభివృద్ధి కొనసాగుతుందనే ప్రచారం చేయాలని సూచనలు చేశారు.
కేవలం భోజనాల కోసమా?
మహానాడు ద్వారా విస్తృత ప్రచారం, ఆర్భాటానికే టీడీపీ ప్రాధాన్యం ఇచ్చింది. కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించామని, అదిరిపోయే భోజనాలు పెట్టామని ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి లోకేష్ ప్రకటించారు. సమస్యలపై చర్చించకుండా భోజనాల మెనూ గురించి ప్రచారం చేసుకోవటం చర్చనీయాంశంగా మారింది. భోజనాల కోసం మహానాడు పెట్టారా? అనే విమర్శలు సొంత పార్టీ నేతల నుంచే వ్యక్తమవుతున్నాయి.
‘మహా’ర్భాటం..!
Published Wed, May 30 2018 4:17 AM | Last Updated on Mon, Oct 8 2018 5:28 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment