గుజరాత్‌లో ఓడినా.. రాహుల్‌ హీరోనే! | No Effect on Rahul Gandhi even if Congress loses Gujarat | Sakshi
Sakshi News home page

Published Sat, Dec 16 2017 2:27 PM | Last Updated on Tue, Aug 21 2018 2:39 PM

No Effect on Rahul Gandhi even if Congress loses Gujarat - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ :  నువ్వా-నేనా అన్న రీతిలో ఎన్నికల ప్రచారం.. బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీ పోటాపోటీ విమర్శలు.. వెరసి గుజరాత్‌ ఎన్నికల ఫలితాల కోసం దేశం మొత్తం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తోంది. తిరిగి పాగా ఎగరవేయాలని కమలం.. రెండు దశాబ్దాల తర్వాత జెండా ఎగరవేయాలని హస్తం పార్టీలు ఆశగా ఎదురు చూస్తున్నాయి.  ఈ తరుణంలో గుజరాత్‌ ఎన్నికల ఫలితాలు.. రాహుల్ పగ్గాలపై నేపథ్యంలో ఎలాంటి ప్రభావం చూపుతాయి? అన్నది చూద్దాం.

గుజరాత్ ఎన్నికల ప్రచారం మొదలయిన సమయంలో పటీదార్‌ నేత హర్దిక్ పటేల్‌ బీజేపీకి ముఖ్య ప్రత్యర్థిగా కనిపించాడు. కానీ, ఎప్పడైతే ప్రచార పర్వం ఊపందుకుందో క్రమక్రమంగా హర్దిక్ తెర వెనక్కి వెళ్లిపోయి.. రాహుల్‌ గాంధీ వైపునకు అందరి చూపు మళ్లింది. పోటాపోటీ ప్రచారం.. మోదీ అండ్‌ బీజేపీపై రాహుల్‌ సహేతుక విమర్శలతో అది ముందుకు సాగింది.  

గెలిచినా.. ఓడినా...

ఒకవేళ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే అది ఖచ్ఛితంగా రాహుల్‌ విజయమే అవుతుంది. ఎందుకంటే కురువృద్ధ పార్టీ తరపున ముందుండి ప్రచారం నిర్వహించింది ఒకే ఒక్కడు కాబట్టి. రైతులు, వ్యాపారస్థులు, గిరిజనులు ఇలా అన్ని వర్గాల వారితో ముఖాముఖి, సభలు నిర్వహించి సమస్యలు తెలుసుకుంటూ వారితో రాహుల్ మమేకం అయ్యాడు. సోషల్ మీడియాలో కూడా ప్రధాని విధానాలను ఎండగడుతూ ముందుకు సాగాడు. ఈ తరుణంలో గుజరాత్‌ గెలుపు కాంగ్రెస్‌కు మనోధైర్యం నింపటం ఖాయం. 

ఎగ్జిట్‌ పోల్స్‌ అన్నీ బీజేపీదే గెలుపని కోడై కూస్తున్న వేళ.. నిజంగానే కాంగ్రెస్‌ ఓడిపోతే రాహుల్‌ నాయకత్వానికి మచ్చగా మిగిలిపోదా? అంటే.. అలాంటిదేం ఉండబోదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు వారు చెబుతున్న కారణాలు ఏంటంటే... 2012 ఎన్నికల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ కు 9 శాతం ఓట్లు తక్కువగా పోల్‌ అయ్యాయి. కానీ, ఈసారి కాంగ్రెస్‌కు అనుకూలంగా కాస్త ఓటింగ్‌ శాతం పెరిగిందని సర్వేలే చెబుతున్నాయి. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్‌ లో కాంగ్రెస్‌ దూసుకుపోవటం ఖాయమన్న సంకేతాలు అందించాయి. అదే జరిగితే బీజేపీకి ఊహించని రీతిలో పెద్ద దెబ్బే తగులుతుంది. 

రాహుల్‌ మేనియా.. బీజేపీలో భయం

నరేంద్ర మోదీ గుజరాత్‌కు 12 ఏళ్లపాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. గుజరాత్‌ మోడల్‌ కు తానే కారణమంటూ ఇప్పటికీ చెప్పుకుంటూనే ఉన్నారు. అలాంటప్పుడు ఇప్పుడు స్వయంగా ఇప్పుడు ఆయనే ప్రజల్లోకి వెళ్లటం ఒకరకంగా రాహుల్‌ కారణంగానే అన్న సంకేతాలు అందించాయి. పైగా మోదీ తీవ్ర విమర్శలకు దిగిన తరుణంలో.. రాహుల్‌ మాత్రం చాలా ఆ విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాడు. వ్యక్తిగత
విమర్శల జోలికి పోకుండా.. కేవలం ప్రజా సమస్యలపైనే ప్రభుత్వాలను నిలదీశాడు. ఆలయ దర్శన విషయంలోనూ వచ్చిన విమర్శలను తనకు అనుకూలంగా మలుచుకున్నారు. ఎన్నికలకు ముందు కమలం నేతలు, కార్యకర్తల్లో నిరుత్సాహం పెరిగిపోవటం.. తొలిసారి సోషల్‌ మీడియా ప్రచారం ద్వారా కాంగ్రెస్‌ పార్టీ హైలెట్‌ కావటం.. తదితర పరిణామాలు కమలాన్ని కలవరపాటుకు గురిచేశాయి. ఈ అంశాలన్నీ పరిగణనలోకి తీసుకుని గుజరాత్‌లో కాంగ్రెస్‌ పార్టీ గెలిచినా.. ఓడినా... భవిష్యత్తులో రాహుల్‌ దూకుడుకు కళ్లెం వేయటం కష్టమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement