మీడియాతో మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
సాక్షి, విజయవాడ : ప్రత్యేక హోదా అంశం దేశంలో ముగిసిన అధ్యాయమని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్సీ మాధవ్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రానికైనా ప్రత్యేక హోదా ఉన్నట్లు ఆయా రాష్ట్రాల వెబ్‌సైట్లలో చూపిస్తే బీజేపీ వెంటనే తగిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. దేశంలోని 29 రాష్ట్రాల్లో దేనికీ ప్రత్యేక హోదా లేదని చెప్పారు. వెనుకబడిన రాష్ట్రాలకు కేవలం సహాయం మాత్రమే కేంద్రం చేస్తోందని వివరించారు. ఈశాన్య రాష్ట్రాలతో ఆంధ్రప్రదేశ్‌ను పోల్చడం నక్కకు నాకలోకానికి ముడిపెట్టడమే అని అన్నారు.
గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ(టీడీపీ) ప్రభుత్వం తీరును ఆయన ఎండగట్టారు. శాసనసభలో ప్రధానమంత్రి క్లిప్పింగ్స్‌ను ప్రతిపక్ష బీజేపీ లేకుండా చూపించడం సభ మర్యాదలు ఉల్లంఘించడమేనని అన్నారు. శాసనసభను టీడీపీ స్వప్రయోజనాల కోసం, స్వార్ధ రాజకీయాలు కోసం వాడుకుంటోందని ఆరోపించారు. ‘మీ ప్రధానమంత్రి’ అంటూ సీఎం చంద్రబాబు శాసనసభలో వాడిన పదజాలాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.
సభలో లేని వారి గురించి ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై అనేక సందర్భంల్లో ప్రధాని మాట మార్చిన విధానాన్ని వీడియో క్లిప్పింగ్స్ రూపంలో ప్రదర్శించారని, అలనే చంద్రబాబు కూడా ప్రత్యేక హోదాపై మాటమార్చిన విధానాన్ని వీడియో క్లిప్పింగ్స్ అసెంబ్లీలో బీజేపీ ప్రదర్శించడానికి అనుమతిస్తారా? అంటూ మండిపడ్డారు. రుణమాఫీ, పార్టీ ఫిరాయింపులపై గతంలో ఇప్పుడు చంద్రబాబు మాట్లాడిన వీడియో క్లిప్పింగ్స్ మీడియాకు చూపించిన మాధవ్.. ఈ మేరకు గవర్నర్‌కు పిర్యాదు చేస్తామని తెలిపారు.
రాజకీయ అవసరాలకు తగ్గట్లు సీఎం వ్యాఖ్యలు చేస్తున్నారని.. అందుకు హోదా కన్నా ప్యాకేజినే బెటర్ అన్న ఆయన ఇప్పుడు బీజేపీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం చేయడం దుర్మార్గమని అన్నారు. బీజేపీ వల్ల 15 సీట్లు కోల్పోయామని అంటున్న చంద్రబాబుకు పొత్తు లేకుండా గెలిచిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా రాసిన లేఖకు శాసనసభలో సమాధానం ఎలా చెప్తారని అన్నారు. ఒకవేళ లేఖపై స్పందించాలంటే ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని.. అలా కాకుండా అమూల్యమైన శాసనసభ సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు.
లేఖలో అమిత్ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా వాటిని తెలుగు ప్రజలపై దాడిగా అభివర్ణించడం సిగ్గుచేటని అన్నారు. బీజేపీ నేతలందరూ అమరావతి రాజధాని ప్రాంతం అంతా తిరిగారని చెప్పారు. ఎమ్మెల్యేలు, అధికారుల నివాస భవన నిర్మాణాలు చేపట్టకుండానే నిర్మించినట్లు రూ.774 కోట్లకు ఏపీ ప్రభుత్వం యూసీజీ ఇచ్చిందని చెప్పారు. కట్టిన బిల్టింగ్‌లు భూ గర్భంలో దాక్కున్నాయా? అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. కట్టకుండా కట్టినట్లు చూపిన ఆ భవనాలు ఎక్కడున్నాయో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment