సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలోని నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో మొత్తం 86 నామినేషన్లు అర్హత సాధించాయి. మంగళవారం ఆయా నియోజకవర్గాల్లోని రిటర్నింగ్ కార్యాలయాల్లో అధికారులు నామినేషన్లను క్షుణ్ణంగా పరిశీలించారు. మల్కాజిగిరిలో 13, చేవెళ్లలో 24, హైదరాబాద్‌లో 19, సికింద్రాబాద్‌లో 30 నామినేషన్లు సక్రమంగా ఉన్నట్లు ఆయా రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. అయితే నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 28 వరకు గడువు ఉంది. నామినేషన్ల పరిశీలన అనంతరం మల్కాజిగిరి లోక్‌సభ బరిలో 13 మంది అభ్యర్థులు మిగిలారు. ఈ నియోజకవర్గానికి మొత్తం 40 మంది 62 నామినేషన్లు దాఖలు చేయగా... వాటిలో 27 దరఖాస్తులను తిరస్కరించినట్లు మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి ఎంవీ రెడ్డి వెల్లడించారు. నామినేషన్ పత్రాల్లో గుర్తించిన పొరపాట్లకు సంబంధించి ఆయా అభ్యర్థులకు నోటీసులు అందజేసి సమాధానం కోరినా సరైన సమయంలో స్పందించకపోవడంతోనే తిరస్కరించామని స్పష్టం చేశారు.
ఇక చేవెళ్ల లోక్‌సభ స్థానానికి సంబంధించి నలుగురుఅభ్యర్థుల నామినేషన్లను ఎన్నికల అధికారులు తిరస్కరించారు. నిబంధనల ప్రకారం వివరాలు సమర్పించకపోవడంతో వారి నామినేషన్లను పక్కన పెట్టినట్లు రిటర్నింగ్ అధికారి డీఎస్ లోకేశ్‌కుమార్ తెలిపారు. ఈ లోక్‌సభ స్థానానికి మొత్తం 28 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో నిబంధనల మేరకు వివరాలు అందజేసిన 24 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. మిగిలిన నలుగురు అసమగ్రంగా వివరాలు సమర్పించారు. 10 మంది ప్రతిపాదిత ఓటర్ల వివరాలు పేర్కొనకపోవడం, ఫారం–26 అసంపూర్తిగా అందజేసిన కారణంగా నామినేషన్లను తిరస్కరించారు. హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి మొత్తం 24 మంది నామినేషన్లు దాఖలు చేయగా... నిబంధనలకు అనుగుణంగా లేని 5 నామినేషన్లను ఎన్నికల రిటర్నింగ్ అధికారులు తిరస్కరించారు. 19 మంది నామినేషన్లు అర్హత సాధించాయి. తిరస్కరణకు గురైన నామినేషన్లలో అక్బరుద్దీన్ ఒవైసీ (ఏఐఎంఐఎం), సతీష్ అగర్వాల్(బీజేపీ), మహ్మద్ అబ్దుల్(టీఆర్‌ఎస్), షేక్ మొయిన్ (ఇండిపెండెంట్), నరేశ్‌చంద్ర(ఇండిపెండెంట్)ల నామినేషన్లు ఉన్నాయి. ఇక సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి 51 నామినేషన్లు దాఖలు కాగా నిబంధలనకు అనుగుణంగా లేని 21 నామినేషన్లను తిరస్కరించారు. 30 మాత్రమే నిబంధలనకు అనుగుణంగా ఉన్నాయని అధికారులు తేల్చారు.
Comments
Please login to add a commentAdd a comment