అహ్మదాబాద్ / సిమ్లా : దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురు చూసిన గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. రెండు చోట్లా బీజేపీ తన సత్తా చాటుకుంది. అయితే ఈ పోరులో ఆశ్చర్యకరమైన ఫలితాలు కూడా కొందరి నేతల తల రాతలు మార్చేశాయి.
ఈ ఎన్నికల్లో కొందరి నేతల కంటే అత్యధికంగా నోటాకే ఓట్లు వచ్చాయి. మొత్తం 5 లక్షల 42వేల 196 ఓట్లు నోటాకే పడ్డాయి. అంటే గుజరాత్‌లో 2 శాతం, హిమాచల్ ప్రదేశ్‌లో 0.9 శాతం ఓట్లు నోటాకే పడ్డట్టు లెక్క. గుజరాత్‌లో నోటా నాలుగో స్థానాన్ని దక్కించుకోవడం మరో గమనార్హం. బీఎస్‌పీ, ఎన్‌సీపీ పార్టీల నేతలు, ఇండిపెండెంట్ అభ్యర్థుల కంటే కూడా నోటాకే ఎక్కువగా ఓట్లు రావడం విశ్లేషకులను సైతం విస్మయానికి గురి చేసింది.
స్వతంత్ర అభ్యర్థి జిఘ్నేష్ మేవాని గెలుపొందిన వాద్గాంలో అత్యధికంగా 4,200 ఓట్లు నోటాకు పడ్డాయి. అదే సీఎం విజయ్ రూపానీ పోటీచేసిన రాజ్‌కోట్(పశ్చిమ)లో 3,300 నోటా ఓట్లు పోలయ్యాయి. సోమనాథ్, నారాయణపుర, గాంధీధామ్‌లలో స్థానిక ఇండిపెండెట్‌ల కన్నా ఎక్కువ శాతం ఓట్లు నోటాకే వచ్చాయి.చాలా మంది నేతల అసెంబ్లీ ఆశలను చిదిమేసింది కూడా ఈ నోటానే. మెజార్టీ నోటా ఓటర్లు యంగ్ గుజరాతీలేనని తేలింది. అంతేకాక యంగ్ పటీదార్ ఓటర్లు కూడా నోటాకే ఎక్కువగా ఓట్లు వేసినట్టు తెలిసింది. రెండేళ్ల క్రితం పటీదార్లు తమకు రిజర్వేషన్లు కావాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నోటాకు వచ్చిన ఓట్లు తక్కువేమీ కాదని విశ్లేషకులంటున్నారు. మఖ్యంగా గుజరాత్‌ను తీసుకుంటే ఇటు బీజేపీకి, అటు కాంగ్రెస్‌కు నోటా గేమ్ ఛేంజర్‌గా ఉన్నట్టు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment